
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
సుమారు 9.7 కోట్ల మంది ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమ
రూ. 5 వేల కోట్ల ఫసల్ బీమా బకాయిలు
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందిస్తున్న నిధులను ఆగస్టు రెండో తేదీన విడుదల చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.7 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లకు పైగా నిధులను ప్రత్యక్ష బదిలీ విధానం ద్వారా జమ చేయనున్నారు.
పీఎం కిసాన్ కింద ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.6,000 ఆర్ధిక సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేశారు. 19వ విడతతో ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా పంపిణీ చేసిన మొత్తం రూ.3.69 లక్షల కోట్లకు చేరగా 20వ విడత నిధులతో ఈ మొత్తం ఏకంగా రూ.3.89 లక్షల కోట్లను దాటనుంది.
పంటల ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించే అంశమై వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం అధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. నిధుల విడుదలపై విస్తృత కార్యక్రమాలను నిర్వహించాలని, కృషి విజ్ణాన కేంద్రాలతో పాటు కృషి సఖీలు, డ్రోన్ దీదీలు, బ్యాంక్ సఖీ, పశు సఖీ, బీమా సఖీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ఫసల్ బీమా కింద రూ. 5 వేల కోట్ల బకాయిలు
దేశ వ్యాప్తంగా సకాలంలో పరిహారం అందేలా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా సంస్థలు రైతులకు రూ.5,405 కోట్ల మొత్తాలను బకాయిపడ్డాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బీమా కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య వివాదాలు, బ్యాంకుల తప్పులు, ఆలస్యమైన బీమా ప్రతిపాదనలు, రాష్ట్రాలు సబ్సిడీ వాటాను ఆలస్యంగా విడుదల చేయడం వంటి కారణాలతో బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.