ఆధారాల్లేని ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమన్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజకీయ ఫిరాయింపులు పెరిగిపోయాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.కేకే రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.ఆర్. జయ సుకిన్ వాదనలు వినిపిస్తూ.. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని వ్యాఖ్యానించారు.
డబ్బు, బెదిరింపులకు పాల్పడి అధికార పార్టీలు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్విర్యం చేస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వెంటనే ప్రత్యర్థి పార్టీల్లో చేరుతున్నారని, ప్రత్యేక విమానాల్లో వారిని క్యాంపులకు తరలిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 190 ప్రకారం ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదించాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా పక్కనపెడుతున్నారని చెప్పారు. ఈ అంశాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, పిటిషనర్ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


