
కోల్‌కతా: ‘నేను ఈ ప్రపంచం కోసం అస్సలు రూపొందలేదు’ అంటూ కోల్‌కతాకు చెందిన పీహెచ్‌డీ స్కాలర్ ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని నాడియాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కొన్ని గంటల ముందు అతను సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ నోట్‌ను పోస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలోగల ఒక ప్రభుత్వ పరిశోధనా సంస్థలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి ఒకరు తనను తోటి విద్యార్థులు ర్యాగింగ్
చేస్తున్నారని విద్యాసంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయితే వారు దీనిని పట్టించుకోలేదు. దీంతో తీవ్రంగా కలత చెందిన అతను క్యాంపస్ ఆవరణలోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడని సమాచారం. మృతుడిని అనమిత్ర రాయ్ గా పోలీసులు గుర్తించారు, నార్త్ 24 పరగణాస్ లోని శ్యామ్ నగర్‌కు చెందిన అనమిత్ర రాయ్ కోల్ కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో బయాలజీలో పీహెచ్ డీ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ప్రయోగశాలలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను కల్యాణిలోని ఎయిమ్స్ కు తరలించారు శుక్రవారం ఉదయం అక్కడ మరణించాడని వైద్యులు ధృవీకరించారు.
అనమిత్ర రాయ్ తన చివరి లేఖలో విద్యాసంస్థ యాజమాన్యం ఉదాసీన వైఖరిపై పలు ఆరోపణలు చేశారు. తనకు జరిగిన ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. తోటి పీహెచ్‌డీ విద్యార్థి సౌరభ్ బిశ్వాస్ తనను, తన సహచరులను వేధింపులకు గురిచేశాడని, దీనిపై యాంటీ ర్యాగింగ్ సెల్‌కు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనమిత్ర పేర్కొన్నారు. విద్యార్థుల వ్యవహారాల మండలి సభ్యులు, సూపర్‌వైజర్ తన ఫిర్యాదుల కంటే ల్యాబ్ ప్రతిష్టకే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
అభ్యంతరకరంగా ప్రవర్తించిన బిశ్వాస్ చేస్తున్న పీహెచ్‌డీ నిరాకరించాలని, ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని రాయ్ కోరారు. తాను ఈ ప్రపంచం కోసం సృష్టించబడలేదని అనిపిస్తుందని, అయితే ఇక్కడ కొంతమంది మంచి మనుషులు,స్నేహితులు తారసపడ్డారని, వారి ప్రేమ దొరికిందని అనమిత్ర రాయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇకపై జీవితాన్ని కొనసాగించలేను. జీవితంలో ఎన్నడూ కనుగొనని శాంతిని మరణంలో పొందగలనంటూ అనమిత్ర రాయ్ ఆ లేఖను ముగించారు.