ప్రజలే నాకు భగవంతుడి స్వరూపం.. ‘పాతికేళ్ల పవర్‌’పై మోదీ | People Are My God: PM Modi Reflects on 25 Years in Public Service | Sakshi
Sakshi News home page

ప్రజలే నాకు భగవంతుడి స్వరూపం.. ‘పాతికేళ్ల పవర్‌’పై మోదీ

Oct 7 2026 11:01 AM | Updated on Oct 7 2026 11:18 AM

People Are My God: PM Modi Reflects on 25 Years in Public Service

సాక్షి, ఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తాను.. ఇన్నేళ్లుగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంత ఉన్నత స్థాయికి చేరుకుంటానని అప్పట్లో ఊహించలేదని చెప్పారు. ప్రతి విజయం తనలో ‘నేను ఏదైనా సాధించగలను’ అనే నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.

ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నా. రాష్ట్ర ఎన్నికలైనా.. సాధారణ ఎన్నికలైనా ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. ఈ రోజు ఉదయం కూడా దేశ ప్రజలందరి కోసం వినాయకుడిని ప్రార్థించాను. ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నా. నాకు ప్రజలే భగవంతుడి స్వరూపం. దేశం నాకు ఎంతో ఇచ్చింది. అందుకే దేశమే నాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని మోదీ పేర్కొన్నారు.

ఇప్పటికీ నేర్చుకుంటున్నా..
తనను తాను ఇప్పటికీ విద్యార్థిగానే భావిస్తానని మోదీ చెప్పారు. చిన్నప్పుడు వడోదరలో కాకుండా వడ్నగర్‌లో పాఠశాలకు వెళ్లిన రోజుల్లో తరగతికి తొలుత వచ్చేవారిలో తానూ ఒకడినని గుర్తుచేసుకున్నారు. నేర్చుకోవాలన్న ఆసక్తి అప్పటి నుంచే తనలో భాగమైందన్నారు. ‘‘ఎంత ఎక్కువ నేర్చుకుంటే.. దేశానికి సేవ చేసే సామర్థ్యం అంత పెరుగుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’’ అని చెప్పారు.

తన 25 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రతి సంకటం ఒక పాఠం నేర్పిందన్నారు. ప్రతి విజయం బాధ్యతను పెంచిందని, ప్రతి సాధన మరింత పెద్ద లక్ష్యాల వైపు వెళ్లేందుకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. మద్దతుదారులు తనకు ప్రోత్సాహాన్ని ఇస్తే.. విమర్శకులు తనను తాను పరిశీలించుకునేలా చేశారని పేర్కొన్నారు.

భూకంపం నుంచి చంద్రయాన్‌ వరకు..
గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎదురైన భుజ్‌ భూకంపం పునర్నిర్మాణంలో పట్టుదలగా ఉండటం నేర్పిందని మోదీ గుర్తుచేసుకున్నారు. చంద్రయాన్‌ వైఫల్యం నుంచి తిరిగి లేవడం నేర్చుకున్నానని తెలిపారు. కరోనా మహమ్మారి దేశ సమష్టి చైతన్యం, ఐక్యత ప్రాధాన్యాన్ని తెలియజేసిందన్నారు. తీపి, చేదు అనుభవాల మధ్య ముందుకు సాగేందుకు మీడియా కూడా తనకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు.

సేవే ధర్మం.. దేశమే తొలి ప్రాధాన్యం
ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బీజేపీ, రాజకీయ సహచరులు, తనపై విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సేవే ధర్మం. నేను యాంబిషన్‌ కోసం కాదు.. మిషన్‌ కోసం జీవిస్తున్నా’’ అని స్పష్టం చేశారు. వేల ఏళ్ల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.

25 ఏళ్ల ప్రస్థానం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం కాదని.. భవిష్యత్తు కోసం సంకల్పాన్ని పునరుద్ఘాటించే సమయమని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తామని, ప్రపంచంలోని టాప్‌-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఇదీ చదవండి: ఎస్‌ఐఆర్ పేరుతో అసలు ఏం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement