
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మిలటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార విభాగాలకు చేరవేస్తున్న సరిహద్దుల్లోని కచ్ జిల్లా వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. లఖ్‌పత్ ప్రాంతానికి చెందిన సహదేవసిన్హ్ గోహిల్(28) కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023లో ఇతడికి అదితి భరద్వాజ్ పేరుతో పాకిస్తాన్ ఏజెంట్ వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేస్తూ అతడిని బుట్టలో వేసుకుంది. గోహిల్ తన ఆధార్ కార్డుతో తీసుకున్న రెండు సిమ్‌ల ఓటీపీలను ఆమెకు పంపాడు.
దీంతో, ఆమె పాకిస్తాన్ నుంచి ఆ నంబర్లతో వాట్సాప్ చాటింగ్ సాగిస్తోంది. ఆమె కోరిన విధంగా, తనుండే ప్రాంతంలోని బీఎస్‌ఎఫ్, నేవీల మౌలిక వసతులతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని, ఫొటోలను పంపాడు. బదులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇతడికి రూ.40 వేల నగదు అందింది. విషయం పసిగట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఇటీవల గోహిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదితి భరద్వాజ్ పాకిస్తాన్ గూఢచారి అనే విషయం గోహిల్‌కు తెలుసునని ఏటీఎస్ శనివారం వెల్లడించింది. ఇతడితోపాటు పాక్ ఏజెంట్ అదితి భరద్వాజ్‌పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపింది.