దాయాది.. మళ్ళీ బరితెగింపు | Pakistan Drones Seen At 26 Indian Locations, Blackouts In Several Cities | Sakshi
Sakshi News home page

దాయాది.. మళ్ళీ బరితెగింపు

May 10 2025 1:18 AM | Updated on May 10 2025 6:44 AM

Pakistan Drones Seen At 26 Indian Locations, Blackouts In Several Cities

 పేట్రేగిన పాక్‌

రెండో రోజూ దాడులు

సరిహద్దు ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లు 

20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి 

శ్రీనగర్‌ విమానాశ్రయంపై దాడికి యత్నం 

దాడులను దీటుగా తిప్పికొట్టిన సైన్యం 

క్షిపణులు, డ్రోన్లు ఎక్కడివక్కడ కూల్చివేత 

కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు 

అక్కడి రాష్ట్రాల్లో అప్రమత్తత, బ్లాకౌట్లు 

మోదీ అత్యున్నత స్థాయి సమీక్షలు

దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్‌ మొదలు రాజస్తాన్‌ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది.

 ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు.  
 

న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్‌ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని రాజస్తాన్‌ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్‌ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్‌ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. 

దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో  సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జో«ద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్‌ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్‌ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్టులు జారీ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. 

అవసరమైతే టెరిటోరియల్‌ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్‌ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్‌ శ్రీవాత్సవ సర్క్యులర్‌ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.

పేలుళ్లు, సైరన్లు 
శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్‌ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్‌ దాడులకు పాక్‌ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.

 పాక్‌ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement