
‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’తో జాగ్రత్త..!
వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం ద్వారా వైరస్ వ్యాప్తికి అవకాశం
అనవసర లింక్‌లు తెరవొద్దని నిఘా వర్గాల హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్‌పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, ఈమెయిల్‌ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’అనే ప్రమాదకరమైన వైరస్‌ను వ్యాప్తి చేయాలని చూస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించాయి.
పాక్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్‌ను అభివృధ్ధి చేసినట్లు సమాచారం. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను దొంగిలించేందుకు ఈ మాల్‌వేర్‌ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తోంది. ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్ పరికరాలను, కంప్యూటర్‌లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంక్ సమాచారం, పాస్‌వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదముందని ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘.exe', "tasksche.exe' వంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైళ్లు సాధారణమైనవిగానే కనిపించినా, చాలా హానికరమైనవని, ఒకసారి క్లిక్ చేసిన తర్వాత, అవి హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్‌ను ఇచ్చేస్తాయని చెబుతున్నారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల లక్ష్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియా ట్రెండ్‌లను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్‌లను కేంద్రం అప్రమత్తం చేసింది.