జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్‌, పూరీలో ఏం జరిగింది? | Pak Spy YouTuber Jyoti Malhotra Case Full Details | Sakshi
Sakshi News home page

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్‌, పూరీలో ఏం జరిగింది?

May 19 2025 10:28 AM | Updated on May 19 2025 2:56 PM

Pak Spy YouTuber Jyoti Malhotra Case Full Details

ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్‌ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్‌ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్‌తో టచ్‌లో..
జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అప్పటి గవర్నర్‌ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్‌ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

	ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పూరీలోనూ జాడలు..
ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

 

2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement