
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. నిందితుడిని గుజరాత్‌కు చెందిన రాజేష్ సాకరియా(41) నిర్ధారించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. రాజ్‌కోట్‌లోని రాజేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ క్రమంలో అతని తల్లి చెప్పిన సమాధానంతో పోలీసులు విస్తుపోయారు.
రాజేష్ ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు. అతనికి కుక్కలంటే చాలా ఇష్టం. అలాంటిది సుప్రీం కోర్టు వీధికుక్కలపై తీర్పు ఇచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బహుశా ఈ నేపథ్యంతోనే దాడి చేసి ఉండొచ్చు అని ఆమె అంటున్నారు. స్థానికులు సైతం రాజేష్ డాగ్ లవర్ అనే విషయాన్ని ధృవీకరించారు. అయితే.. అరెస్టైన తన బంధువును విడిచిపించే విషయంలో రాజేష్ ఢిల్లీ సీఎం సాయం కోరాడని.. బహుశా ఆ వ్యవహారంలోనే ఆమెపై దాడికి పాల్పడి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. సీఎంపై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఢిల్లీ ఘటనలో..
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కొన్ని చేతిలో కొన్నిపేపర్లతో రాజేష్ ఢిల్లీ సీఎం రేఖాగుప్తా దగ్గరకు వచ్చాడు. వాళ్లు మాట్లాడుకుంటున్న టైంలోనే.. అరుస్తూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. అయితే మరికొందరు మాత్రం రాజేష్ తాగి వచ్చాడని చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు.

కోర్టు తీర్పు.. ఢిల్లీ సీఎం స్పందన
ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్‌లలో కుక్క కాటు ఘటనలు, రేబిస్ మరణాలపై మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా విచారణ జరిపింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ఆగష్టు 11వ తేదీన ఎనిమిది వారాల్లో ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీధికుక్కలన్నింటిని షెల్టర్‌లకు తరలించాలని, మూగజీవాల ప్రేమికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అదే సమయంలో.. జంతు ప్రేమికుల అభ్యంతరాలతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈలోపు.. ఈ ఆదేశాలను నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు కాగా విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటన చేయలేదు. కానీ, సీఎం రేఖా గుప్తా మాత్రం స్పందించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా తొందరపాటు చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. జంతు ప్రేమికుల మనోభావాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారామె. మరోవైపు.. ఢిల్లీ అధికార యంత్రాంగం మాత్రం సుప్రీం ఆదేశాలు ఆచరణ సాధ్యం కావడం కాస్త కష్టమేనంటోంది. ఢిల్లీలో 3 లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నాయని జంతు హక్కుల కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తెలిపారు. వీధికుక్కలను తరలించడం, వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయడం, మెయింటెనెన్స్.. మొత్తం ఏడాదికి రూ. 15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. అయినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాథమిక చర్యలు ప్రారంభించింది.
ఉలిక్కిపడ్డ దేశం..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఈ ఉదయం ఓ వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడడంతో.. దేశం మొత్తం ఉలిక్కిపడింది. సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో జన్ సునాయ్ కార్యక్రమంలో భాగంగా.. ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక కాగితాన్ని అందించాడు. వెంటనే గట్టిగా అరుస్తూ, దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖకు ఘటన తాలుకా వివరాలను ఢిల్లీ పోలీసులు నివేదించారు.
పొలిటికల్ రియాక్షన్స్
ఈ దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటి?‘ అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.