
న్యూఢిల్లీ: రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మొదలయ్యింది. బుధవారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ తన నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలంతా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతుగా సంతకాలు చేశారు.
సీపీ రాధాకృష్ణన్ మద్దతుగా 20 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి ముందు ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీఏ పక్ష నేతలు సమావేశమయ్యారు. కాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఎన్డీయే ఎంపీల సమావేశం జరగగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ప్రధాని స్వయంగా ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.