
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కేసులో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తన పాకిస్తాన్ పర్యటనలను వివరించే పలు వీడియోలను జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన దరిమిలా ఆమె వార్తల్లో నిలిచారు. 33 ఏళ్ల ఈ యూట్యూబర్‌ను పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.
ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau)లు జ్యోతి మల్హోత్రా కేసును దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఆమె డైరీలోని రెండు పేజీలు సంచలన వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో ఆమె పాకిస్తాన్‌లో 10 రోజుల పాటు ఎలా గడిపారనే వివరాలున్నాయని సమచారం. ఈ డైరీని హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ‘ఈ రోజు, నేను పాకిస్తాన్‌లో 10 రోజుల పర్యటన ముగించుకుని, నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుండి ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్‌ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు’ అని తేదీ లేని ఆ పేజీలో జ్యోతి మల్హొత్రా రాసినట్లు ఉంది.
పాకిస్తాన్‌ను రంగులమయంగా అభివర్ణించిన ఆమె అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని పేర్కొంది. డైరీలోని ఎంట్రీలలో ఆమె పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన వివరాలు ఉన్నాయి. ‘పాక్‌లోని దేవాలయాలను కాపాడండి. 1947లో వారు విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి’ అని ఆమె పేర్కొంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను మే 16న అరెస్టు చేసిన అధికారులు.. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’