
హృదయవిదారకమైన ఒడిషా బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. హెచ్‌వోడీ లైంగిక వేధింపుల పర్వాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు చేసిన కాపీ.. అందులో పేర్కొన్న విషయాలు బయటకు వచ్చాయి.
బాలాసోర్ బీఈడీ విద్యార్థిని బలవన్మరణం కేసులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. నిప్పంటించుకునే పది రోజుల ముందు.. 22 ఏళ్ల బాధిత విద్యార్థిని సీఐసీసీ(college's internal complaints committee)కి ఫిర్యాదు చేసింది. అందులో సీనియర్ ఫ్యాకల్టీ నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూనే.. చర్యలు తీసుకోకుంటే గనుక ప్రాణం తీసుకుంటానని హెచ్చరించింది కూడా.
జులై 1వ తేదీన ఆమె రాసిన లేఖలో ఇలా.. గత కొన్ని నెలలగా బీఈడీ డిపార్ట్‌మెంట్ హెచవోడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహూ నన్ను వేధిస్తున్నారు. తక్కువ మార్కుల వేస్తానని, నన్ను ఫెయిల్ చేస్తానని.. నా గురించి నా కుటుంబంతో లేనిపోనివి చెబుతానని బెదిరిస్తూ వస్తున్నారు. అన్నింటికి మించి తన కోరికెలు తీర్చమంటూ వేధిస్తున్నారు.

మనశ్శాంతి కరువై మానసికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. నేను బలవన్మరణానికి పాల్పడతాను. నా చావుకు హెచ్‌వోడీ, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని లేఖ రాసిందామె.
జూన్ 30వ తేదీన ఫకీర్ మోహన్ కాలేజీ ప్రిన్సిపల్ దీలీప్ ఘోష్ దృష్టికి ఆమె విషయాన్ని తీసుకెళ్లింది. ఆ మరుసటిరోజు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదును సమర్పించింది. అంతటితో ఆగకుండా.. పది రోజులపాటు ఆ ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ సీఎం, విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేను ట్యాగ్‌చేసి మరీ కోరింది. అయినా ఫలితం లేకపోయింది.
జులై 12వ తేదీన.. ఆమె కాలేజీలోని ప్రిన్సిపల్ గది ఆవరణలో నిప్పటించుకుంది. 95 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెను రక్షించడానికి వెళ్లిన మరో విద్యార్థిని కూడా 70 శాతం గాయాలపాలై చికిత్స పొందుతోంది. ప్రధాన బాధితురాలిని బాలాసోర్ జిల్లా ఆస్పత్రిలో.. ఆపై భువనేశ్వర్‌లో ఎయిమ్స్‌కు ఆమెను తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాధితురాలు కన్నుమూసింది.
ఈ కేసుకు సంబంధించిన బీఈడీ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ, కాలేజీ ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌లను కాలేజీ యాజమానయం తొలగించగా.. ఆపై పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఉదయం బాలాసోర్‌లోని బాధితురాలి స్వగ్రామం పలాసియాకు మృతదేహాన్ని తరలించారు. ఊరు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. ఆమె మృతదేహాంతో కాసేపు రోడ్డుపై ఆందోళనకు దిగింది.
ఈ ఘటనపై సీఎం మోహన్ చరణ్ మజ్హీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారాయన. మరోవైపు.. స్వరాష్ట్రం ఒడిశా పర్యటనలో ఉన్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సోమవారం సాయంత్రం AIIMSకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆపై కాసేపటికే ఆమె కన్నుమూయడం గమనార్హం.
ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వినవస్తున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదు.. బీజేపీ వ్యవస్థ చేసిన హత్య అని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న రాహుల్.. బాధిత విద్యార్థిని ధైర్యంగా తన గొంతుక వినిపించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నేనేం చావడానికి ఇక్కడికి రాలేదు!