రికార్డ్ నెలకొల్పనున్న నితీశ్ కుమార్
19న అధికార పక్ష నేతగాఎన్నిక
20న ముఖ్యమంత్రిగా ప్రమాణం!
పట్నా: అన్ని వర్గాల ఓటర్ల ఆశీస్సులు పొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో పదోసారి సీఎంగా ప్రమాణంచేయబోతున్నారు. ఈ ప్రక్రియకు సోమవారం తొలి అడుగు పడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటులోభాగంగా పట్నాలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను నితీశ్ కలిసి తన రాజీనామా లేఖను అందించారు. బుధవారం మళ్లీ కలిసి తనకు మద్దతుగా నిలిచిన ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేల జాబితాను అందజేయనున్నారు.
నవంబర్ 19వ తేదీన నితీశ్‌ను అధికార పక్ష నేతగా ఎన్నుకోబోతున్నట్లు జనతాదళ్(యునైటెడ్) పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. పట్నాలో నవంబర్ 20వ తేదీన గాంధీమైదాన్‌లో జరిగిన భారీ ప్రమాణస్వీకారోత్సవంలో నితీశ్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణంచేయబోతున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే వేదికపై మరి కొందమంది నేతలు సైతం కేబినెట్ మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు.
ప్రధాని మోదీ, పలువురు ఎన్‌డీఏ కూటమి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ప్రమాణస్వీకార కార్య క్రమానికి విచ్చేయ నున్నారు. కేబినెట్ మంత్రులుగా తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ, జేడీయూసహా ఎన్‌డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీల ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. లాబీయింగ్ బెడద హఠాత్తుగా పెరిగిందని జేడీయూ వర్గాలు తెలిపాయి. తొలిరోజు నితీశ్‌తోపాటు ఐదారు మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశముంది.
కొత్త కేబినెట్‌లో మహ్నార్ నియోజకవర్గంలో గెలిచిన జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా చేరే వీలుంది. లోక్‌జనశక్తి(ఆర్‌వీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, హెచ్‌ఏఎంఎస్ చీఫ్ జితన్ రాం మాంఝీ, ఆర్‌ఎల్‌ఎం నేత ఉపేంద్ర కుష్వాహాల కేబినెట్ బెర్త్ ఖరారైందని తెలుస్తోంది. ఎల్‌జేపీ(ఆర్‌వీ)కి మూడు, హెచ్‌ఏఎంఎస్, ఆర్‌ఎల్‌ఎంకు చెరొకటి మంత్రి పదవి దక్కొచ్చు.
బీజేపీ నుంచి 16, జేడీయూ నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రీయలోక్‌దళ్(ఆర్జేడీ), కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీల మహాగఠ్‌బంధన్ తరఫున బిహార్ అసెంబ్లీలో విపక్షనేతగా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ చెప్పారు. ఎన్‌డీఏ కూటమి తర్వాత రాష్ట్రంలో ఆర్జేడీ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 25 చోట్ల గెలిచింది. ఫలితాల్లో ప్రజల మనోగతం ప్రతిబింబించట్లేదని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. దీంతో ఈవీఎంలలో అవకతవకల అంశాన్ని కోర్టులో సవాల్‌చేసే వీలుంది.


