
ఎన్నికల వేళ బిహార్ సీఎం నితీష్ కుమార్ నజరానా
పట్నా: బిహార్‌లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. మహిళా సాధికారతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. బిహార్‌లో శాశ్వత నివాసితులు అయిన మహిళలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ‘‘అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాల్లో బిహార్‌కు చెందిన మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 35% రిజర్వేషన్ అందిస్తాం’’ అని నితీష్ కుమార్ అన్నారు.
అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ సేవల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించి పరిపాలనలో కీలక పాత్ర పోషించేలా చూడటం ఈ నిర్ణయం లక్ష్యమని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. పట్నాలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా యువజన కమిషన్
అంతేకాదు.. రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వ సహకారాన్ని మరింత పెంచుతూ కొత్తగా బిహార్ యువజన కమిషన్ (Bihar Youth Commission) ఏర్పాటు చేయనున్నట్లు నితీష్ ప్రకటించారు. 'బిహార్ యువతకు శిక్షణ ఇచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించి.. సమర్థులుగా మార్చడానికి మా ప్రభుత్వం బిహార్ యువజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలపడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింద'ని నితీశ్ తెలిపారు.
యువత అభ్యున్నతికి తోడ్పాటు..
బిహార్ యువజన కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు వైస్-చైర్‌పర్సన్‌లు, ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా 45 ఏళ్లలోపు వారే ఉంటారు. రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా కమిషన్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న బిహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు పాటు పడుతుంది. రాష్ట్రంలోని యువత సాధికారత, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.