
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ సందడి మొదలయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇదే సమయంలో కేంద్ర రైల్వే మంత్రి బీహార్‌లో కొత్తగా ప్రారంభమయ్యే రైళ్లు, రైలు ప్రాజెక్టులు, టెక్ పార్కుల గురించిన వివరాలను వెల్లడించారు.
బీహార్‌లో పర్యటించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో చేపట్టబోయే కార్యక్రమాలను మీడియాకు తెలిపారు. బీహార్‌ను దేశంలోని పలు నగరాలతో అనుసంధానించే బహుళ రైలు సర్వీసుల ప్రణాళికలను ఆవిష్కరించారు.
కొత్త రైళ్లు
పట్నా నుండి ఢిల్లీ: పట్నా-ఢిల్లీ కారిడార్‌ను బలోపేతం చేస్తూ, కొత్తగా రోజూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు మంత్రి తెలిపారు.
దర్భంగా నుండి లక్నో (గోమతి నగర్): వారంలో ఒక్కరోజు నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రారంభం కానుంది.
మాల్డా టౌన్ నుండి లక్నో (గోమతి నగర్): పశ్చిమ బెంగాల్- ఉత్తరప్రదేశ్‌లను బీహార్ ద్వారా కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు.
జోగ్బాని నుండి ఈరోడ్ (తమిళనాడు): బీహార్‌ను దక్షిణ భారతానికి అనుసంధానించే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి ఎక్కనుంది.
సహర్సా నుండి అమృత్‌సర్: పంజాబ్‌కు కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.
మౌలిక సదుపాయాలు
భాగల్పూర్-జమాల్పూర్ మూడవ లైన్: రూ. 1,156 కోట్ల అంచనా వ్యయంతో 53 కి.మీ. మేరకు కొత్త మూడవ రైల్వే లైన్ త్వరలో మంజూరు కానుంది.
భక్తియార్పూర్-రాజ్‌గిర్-తిలైయా డబ్లింగ్: రూ. 2,017 కోట్ల అంచనా వ్యయంతో 104 కి.మీ. కంటే ఎక్కువ ట్రాక్‌ల డబ్లింగ్ ఏర్పాటు కానుంది.
రాంపూర్హాట్-భాగల్పూర్ డబ్లింగ్: రూ. 3,000 కోట్ల అంచనా వ్యయంతో 177 కి.మీ. మేరకు మరో డబ్లింగ్ ప్రాజెక్ట్ మంజూరు కానుంది.
సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు
రైల్వే మౌలిక సదుపాయాలతో పాటు, బీహార్‌లో సాంకేతిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రెండు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.