దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుక్మా జిల్లాల్లోని 12 ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 2023 అరన్‌పూర్ ఐఈడీ పేలుడుకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. నాడు జరిగిన పేలుళ్లలో 11 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడులకు కుట్ర పన్నడం, లెవీ వసూలు చేయడం, ఆర్థిక నెట్‌వర్క్‌ను నిర్వహించడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్ట్)క్రియాశీల సభ్యులు, మద్దతుదారులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది.
ఈ ఆపరేషన్‌లో ఎన్‌ఐఏ అధికారులు పలు నేరారోపణ పత్రాలు, చేతితో రాసిన లేఖలు, లెవీ రసీదులు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే మావోయిస్టు పరిచయాలకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని సమాచారం. కాగా ఇప్పటివరకు ఈ కేసులో 27 మంది అనుమానితులను అరెస్టు చేశారు. రెండు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా మరిన్ని అరెస్టులు చేయనున్నామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
2023, ఏప్రిల్ 26న, దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ ప్రాంతంలో నక్సలైట్లు.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ)సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో పది మంది సైనికులతో పాటు ఒక డ్రైవర్ అమరులయ్యారు. రోడ్డు పక్కన 50 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను అమర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పేలుడు అత్యంత శక్తివంతంగా ఉండటంతో రోడ్డుపై ఏడు అడుగుల లోతున గుంత ఏర్పడింది. ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టి, ఉగ్రవాద కుట్ర, నిధుల నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Bihar: ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వీడియో వైరల్


