పట్నా: బీహార్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఆరోజు ఓటువేసిన ఎల్‌జేపీ(రామ్ విలాస్) ఎంపీ శాంభవి చౌదరికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటూ చర్చించుకుంటున్నారు.
బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో ఓటు వేసిన తర్వాత ఎంపీ శాంభవి చౌదరి తన రెండు చేతి వేళ్లపై సిరా గుర్తులను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది డబుల్ ఓటింగ్, విధానపరమైన లోపాల ఆరోపణలకు ఆజ్యం పోసింది. పట్నాలోని బుద్ధ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రం వెలుపల చిత్రీకరించిన ఈ వీడియోలో ఎంపీ శాంభవి తన తండ్రి, జేడీయూ నేత అశోక్ చౌదరి, తల్లి నీతా చౌదరితో కలిసి కనిపిస్తున్నారు.
#WATCH | Patna | JDU leader Ashok Chaudhary, his wife Nita Chaudhary, daughter and LJP Ram Vilas MP Shambhavi Chaudhary cast their vote at a polling booth at Buddha Colony’s ST Paul School pic.twitter.com/r8ts2SIQcB
— ANI (@ANI) November 6, 2025
వీడియోలో ముందుగా ఆమె తన వేలిపై సిరా గుర్తును చూపేందుకు తన కుడి చేతి వేలిని చూపిస్తారు. తరువాత ఎడమ చేతి వేలిని చూపిస్తారు. ఈ వేలిపై కూడా సిరా గుర్తు కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పట్నా జిల్లా పరిపాలన అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సిరా గుర్తు వేయడానికి బాధ్యత వహించే పోలింగ్ సిబ్బంది పొరపాటున తొలుత కుడి చేతి వేలికి సిరాను పూసారని, అయితే ప్రిసైడింగ్ అధికారి జోక్యం చేసుకున్న తర్వాత, ఆమె ఎడమ చేతి వేలికి కూడా సిరాను రాశారని దానిలో స్పష్టం చేశారు. బుద్ధ కాలనీలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 61లోని ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ 275లో మాత్రమే శాంభవి తన ఓటును వేశారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్: ‘ఇకపై 10కి ఆఫీసు’


