న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత‌? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు? | Sakshi
Sakshi News home page

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత‌? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?

Published Thu, May 23 2024 12:28 PM

New Delhi Railway Station be Closed Plan

భారతీయ రైల్వేను ‘దేశానికి లైఫ్ లైన్’ అని అంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వేశాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తరువాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఎప్పటి నుంచి మూసివేస్తారనేదానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఈ ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తోంది.

రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1,300 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించే పనులు ప్రారంభంకానున్నాయి. 
కాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్‌ను అకస్మాత్తుగా మూసివేయడం రైల్వేకు పెను సవాలుగా మారనుంది. అయితే ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్ల మీదుగా దారిమళ్లించనున్నారు.  

ఈస్ట్‌ ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఆనంద్ విహార్ స్టేషన్‌కు మార్చనున్నారు. అలాగే పంజాబ్, హర్యానాకు వెళ్లే రైళ్లను సరాయ్ రోహిల్లా వైపు మళ్లించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే రైళ్లను ఢిల్లీ కాంట్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌ల మీదుగా మళ్లించనున్నారు. మిగిలిన కొన్ని రైళ్లను ఘజియాబాద్‌కు మళ్లించే అవకాశ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రైల్వేశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. 
 
మీడియాకు అందిన సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఈ  పనులను ఏకకాలంలో చేయాలని గతంలో ప్రభుత్వం యోచించింది. అయితే ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement