
వ్యాపారవేత్త ఖెమ్కా హత్యపై రాహుల్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా పట్నా లోని ఆయన నివాసం వద్ద హత్యకు గురి కావడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి బిహార్‌ను దేశానికే నేర రాజధానిగా మార్చారన్న విషయం మరోసారి రుజువైందంటూ ధ్వజమెత్తారు. ‘లూటీలు, తుపాకీ కాల్పులు, హత్యలతో బిహార్ అట్టుడుకుతోంది. నేరాలు కార్యకలాపాలు సాధారణమై పోయాయి. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సోదరసోదరీమణులారా, ఈ అన్యాయాన్ని ఇక ఏమాత్రం సహించొద్దు.
మీ పిల్లలను కాపాడలేని ప్రభుత్వానికి మీ భవిష్యత్తును గురించిన బాధ్యతలను అప్పగించొద్దు’అని కోరారు. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి హత్య, ప్రతి లూటీ, ప్రతి బుల్లెట్ మార్పునకు నాంది కావాలన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికే కాదు, రాష్ట్రాన్ని రక్షించేందుకు కూడా ఓటేయాలని కోరారు. శుక్రవారం పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని నివాసం వద్ద గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఖెమ్కా ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఖెమ్కా హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.