breaking news
businessman dies
-
దేశ నేర రాజధానిగా బిహార్
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా పట్నా లోని ఆయన నివాసం వద్ద హత్యకు గురి కావడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి బిహార్‌ను దేశానికే నేర రాజధానిగా మార్చారన్న విషయం మరోసారి రుజువైందంటూ ధ్వజమెత్తారు. ‘లూటీలు, తుపాకీ కాల్పులు, హత్యలతో బిహార్ అట్టుడుకుతోంది. నేరాలు కార్యకలాపాలు సాధారణమై పోయాయి. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సోదరసోదరీమణులారా, ఈ అన్యాయాన్ని ఇక ఏమాత్రం సహించొద్దు. మీ పిల్లలను కాపాడలేని ప్రభుత్వానికి మీ భవిష్యత్తును గురించిన బాధ్యతలను అప్పగించొద్దు’అని కోరారు. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి హత్య, ప్రతి లూటీ, ప్రతి బుల్లెట్ మార్పునకు నాంది కావాలన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికే కాదు, రాష్ట్రాన్ని రక్షించేందుకు కూడా ఓటేయాలని కోరారు. శుక్రవారం పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని నివాసం వద్ద గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఖెమ్కా ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఖెమ్కా హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. -
ఎన్నారై అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ : అమెరికాలో స్థిరపడ్డ భారత వ్యాపారవేత్త ఆదివారం శవంగా తేలాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మున్ని జైట్లీ(35) అనే ప్రవాస భారతీయుడు తన కుటుంబంతోపాటు అమెరికాలో స్థిరపడ్డాడు. గురువారం వ్యాపారరీత్యా న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లోకి అద్దెకు దిగారు. ఈ క్రమంలో శుక్రవారం జెట్లీకి అతడి తండ్రి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో హోటల్ స్టాఫ్‌కు కాల్ చేసి కొడుకుతో మాట్లాడాలని చెప్పారు. హోటల్ యజమాన్యం ల్యాండ్ లైన్ ద్వారా కాల్ కలపగా.. జైట్లీ ఫోన్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది వారి దగ్గరున్న మరో కీ గది తాళం తీసి చూడగా అతడు స్పృహ కొల్పోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జైట్లీది సాధారణ మృతిగానే భావిస్తున్నామని అయితే ఇప్పుడే అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. మరిన్ని పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక మున్ని జైట్లీ అకాల మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
రోడ్డు ప్రమాదంలో బండల వ్యాపారి మృతి
గుత్తి: గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బండల వ్యాపారి మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ఆయన తల్లి తీవ్రంగా గాయపడింది. పెద్దవడుగూరు ఎస్ఐ రమణారెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని మూడో రోడ్డులో నివాసముంటున్న రవికుమార్‌రెడ్డి (42) బండల ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. తల్లి విజయలక్ష్మికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గురువారం ఇండికా కారు (ఏపీ 09 బీఎన్ 5698)లో కర్నూలుకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాడు. శుక్రవారం తల్లితో కలిసి తాడిపత్రికి అదే కారులో పయనమయ్యాడు. గుత్తి సమీపంలో 44వ నంబరు జాతీయరహదారిపై కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న రవికుమార్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. తల్లి విజయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. మృతుడికి భార్య , పిల్లలు ఉన్నారు. ఎస్ఐ రమణారెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. రూట్ అవగాహన లేకే.. హైవే నుంచి తాడిపత్రికి వెళ్లాలంటే కొత్తపేట వద్ద ఫ్లై ఓవర్ దిగాలి. అయితే తాడిపత్రికు ఎలా వెళ్లాలో తెలియని రవికుమార్‌రెడ్డి అలాగే ముందుకు అంటే అనంతపురం వైపు కొంత దూరం నడిపాడు. కొత్తపేట నుంచి కేవలం కిలో మీటరు దూరంలో సైన్‌బోర్డుకు ఢీకొని మృత్యువాత పడ్డాడు. తాడిపత్రి రోడ్డుకు కారును తిప్పి ఉంటే అసలు ప్రమాదం జరిగేది కాదని పోలీసులు చెప్పారు.