శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం ధామి
ఇతర రాష్ట్రాలకు మోదీ సూచన
యూసీసీని అమలు చేస్తోందని, మత మార్పిడులు అడ్డుకుంటోందని ప్రశంసలు
రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న మోదీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు రాకుండా ధైర్యంగా చర్యలు చేపట్టిందని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తోందని, చట్టవిదరుద్ధమైన మత మార్పిడులను సమర్థంగా అడ్డుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం ఉత్తరాఖండ్ మార్గంలో నడవాలని సూచించారు. యూసీసీ అమలుపై ఉత్తరాఖండ్ చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మత మార్పిడుల నియంత్రణ చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తోందని తెలిపారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.8,260.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భూములు కబ్జా కాకుండా, జనాభాలో అవాంఛనీయ మార్పులు రాకుండా ఇక్కడి బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులను తొలగించుకుంటూ ఉత్తరాఖండ్ శరవేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని అన్నారు.
రాష్ట్ర ప్రజలే నాకు స్ఫూర్తి
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. కొండలపై ప్రతికూల వాతావరణంలో జీవిస్తూ కష్టపడి పనిచేసే ఇక్కడి ప్రజలు తనకు నిత్యం స్ఫూర్తినిస్తుంటారని చెప్పారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని తేల్చిచెప్పారు. రాష్ట్రం బలం ఆధ్యాత్మిక శక్తిలోనే ఉందన్నారు. గత 25 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని కొనియాడారు.
విద్య, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధనం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. 25 ఏళ్ల క్రితం రాష్ట్రం బడ్జెట్ రూ.4,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరిందని స్పష్టంచేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకోసం ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు, యోగా కేంద్రాలను గ్లోబల్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని చెప్పారు.


