
చెన్నై: నాగాలాండ్ గవర్నర, బీజేపీ మాజీ ఎంపీ ఎల్ గణేశన్(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ) సాయంత్రం చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 8వ తేదీన తలకు తగిలిన గాయంతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. కన్నుమూశారు. అప్పట్నుంచి స్పృహకోల్పోయిన గణేషన్.. తిరిగి కోలుకోలేదు.
ఆయన అంత్యక్రియలు టీ నగర్‌లోని ఆయన ఇంటి వద్ద నిర్వహించనున్నారు. గణేశన్ భౌతికాయాన్ని రాజకీయ నాయకులు, బంధువులు సందర్శనార్థం రేపు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) ఆయన ఇంటివద్ద ఉంచనున్నారు.
1945, ఫిబ్రవరి 16వ తేదీన తంజావూర్‌లో ఆయన జన్మించారు. ఆయన యువకుడిగా ఉండగానే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన లా గణేషన్.. తండ్రి, అన్నల బాటలోనే నడిచారు. అలా 1970లో ఫుల్‌టైమ్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఎంపికయ్యారు.
1991లో బీజేపీలో చేరిన ఆయన.. తమిళనాడు రాష్ట్ర యూనిట్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించబడ్డారు. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆపై 10 ఏళ్ల తర్వాత గణేశన్ బీజేపీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీకి జాతీయ స్థాయిలో వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన సేవలందించారు.
2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 2021, ఆగస్టు 27వ తేదీన మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న లా గణేశన్... 2023, ఫిబ్రవరి 19వ తేదీ వరకూ పని చేశారు. అదే సమయంలో జూలై 2022 నుంచి నవంబర్ వరకూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే గాయంతో ఆస్పత్రి పాలైన ఆయన... 2025, ఆగస్టు 15వ తేదీన మృతిచెందారు.