మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు.. జాతీయ రహదారుల దిగ్బంధం | Maratha Quota Stir Intensifies Trains Halted | Sakshi
Sakshi News home page

మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం

Published Tue, Oct 31 2023 4:41 PM | Last Updated on Tue, Oct 31 2023 9:40 PM

Maratha Quota Stir Intensifies Trains Halted - Sakshi

ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాలు,  విద్యలో రిజర్వేషన్లు కోరుతూ నిరసనకారులు రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. నేడు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు నిరసనకారులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్‌లో  రైలు పట్టాలను దిగ్బంధించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకారులు రైలు పట్టాలపై టైర్లు తగులబెట్టారు. అటు.. జల్నా జిల్లాలో జరిగిన నిరసనల్లో కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారని పోలీసులు మంగళవారం తెలిపారు. 

రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జల్నాలో జరిగిన మరో ఘటనలో షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఆందోళనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. 

రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయులు రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement