మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా

Eknath Shinde Loyalists Resign As MPs Over Maratha Quota Issue - Sakshi

మహారాష్ట్రలో ముదిరిన మరాఠా రిజర్వేషన్ వివాదం

సీఎం ఎక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా

మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్

ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. 

రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్‌లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. 

రిజర్వేషన్‌లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు.  

మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top