
కౌశాంబి: దేశంలోని కొన్ని కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి కొసాగుతుంటాయంటారు. ఇలాంటి పెండింగ్ కేసుల కారణంగా కోర్టును ఆశ్రయించిన పలువురు ఇబ్బందులు పడుతుంటారు. ఇదే తరహాకు చెందిన ఒక ఉదంతం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. హత్య, హత్యాయత్నం నేరాల కింద 43 ఏళ్లపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత 104 ఏళ్ల వృద్ధుడికి ఎట్టకేలకు విముక్తి లభించింది.
యూపీలోని అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కౌశాంబి జిల్లా జైలు అధికారులు ఆయన్ను విడిచిపెట్టారు. కౌశాంబి జిల్లా గౌరయె గ్రామానికి చెందిన లఖన్ 1921 జనవరి 4వ తేదీన జన్మించినట్లు జైలు రికార్డుల్లో(prison records) ఉంది. 1977 ఆగస్ట్ 16వ తేదీన గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాట సమయంలో ప్రభు సరోజ్ అనే వ్యక్తిని చంపడంతోపాటు మరొకరిపై హత్యాయత్నం ఆరోపణలపై లఖన్, మరో ముగ్గురిపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో 1982లో ప్రయాగ్‌రాజ్ సెషన్స్ కోర్టు ఈ నలుగురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
దీనిపై లఖన్ అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)కు అప్పీల్ చేసుకున్నారు. దిగువ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే నిందితుల్లో ముగ్గురు చనిపోయారు. తాజాగా, అలహాబాద్ హైకోర్టు లఖన్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆయన్ను విడుదల చేయాలని మే 2వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జైలు అధికారులు మంగళవారం లఖన్‌ను విడుదల చేసి, కౌశాంబి జిల్లాలోని షరీరా ప్రాంతంలో ఉంటున్న ఆయన కుమార్తె ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు.
ఇది కూడా చదవండి: Hamburg: రైల్వేస్టేషన్‌లో కత్తితో దాడి.. 12 మందికి గాయాలు