
ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెననుకో ఈ బతుకే మనసు తీరా.. అన్నాడొక కవి. ఆ కుర్రాడు కూడా ప్రేమించాడు. ప్రేమను పండించు కోవాలనుకున్నాడు. శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అదే నేరమైంది. గరళమైంది. ఇరవయ్యేళ్లకే నూరేళ్లు నింపింది. గులాబీలు ఇచ్చిన చేతులతోనే గటగట గరళం తాగాడు. ప్రేమను నిరూపించుకోవాలనే పెద్దల శాసనం.. అతనికి మృత్యు శాసనమయ్యింది.
ఇరవయ్యేళ్లకే నూరేళ్లు
ఇది సినిమా కథ కాదు.. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో జరిగిన ఒక హృదయాన్ని మెలిపెట్టే విషాదం. కృష్ణకుమార్ పాండో (20).. సోనారి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వారిద్దరి గాఢమైన ప్రేమబంధం అమ్మాయి కుటుంబానికి తెలిసిపోయింది. ఆ రోజు సెప్టెంబర్ 25.. ఆ యువతి కుటుంబం కృష్ణను తమ ఇంటికి పిలిపించింది. తన ప్రేయసి కుటుంబం ముందు కృష్ణ ధైర్యంగా నిలబడ్డాడు. అతని ధైర్యమల్లా.. ఆ క్షణంలో తన గుండె నిండా ఉన్న నిస్వార్థమైన, నిండైన ప్రేమే. కానీ ఆ కుటుంబం అతని ప్రేమను నమ్మడానికి ఒక అగ్నిపరీక్ష పెట్టింది. కాదుకాదు బలిపీఠం ఎక్కించింది.
విషం తాగి నిరూపించుకో..
‘నీ ప్రేమ నిజమే అయితే విషం తాగి నిరూపించుకో’.. అన్న పెద్దల మాటలు అతని చెవుల్లో ఎలా ఉరిమి ఉంటాయో ఊహించండి. ప్రేమ కోసం ఏదైనా చేస్తాననే యువకుడి ఆరాటాన్ని ఆ కుటుంబం దారుణంగా ఉపయోగించుకుంది. బహుశా ఆ క్షణంలో అతనికి తన జీవితం కంటే, తన ప్రేమ నిజమని రుజువు చేయడమే ముఖ్యం అనిపించిందేమో. వెనకా ముందూ ఆలోచించలేదు.. కృష్ణకుమార్ విషం తాగేశాడు. విషం.. అతని శరీరంలోకి ప్రవహించింది. ప్రతి కణాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది.
నరకయాతన అనుభవించి..
ఆ తరువాత, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా ఆసుపత్రికి మార్చినా, అతని పరిస్థితి విషమంగానే ఉంది. అతని గుండె, ఊపిరితిత్తులు ఆ విష ప్రభావానికి లొంగిపోతుంటే, చివరి క్షణాల్లో ఏం గుర్తుకొచ్చిందో.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముఖమా.. లేదా తన ప్రేమను బలిపీఠం ఎక్కించిన పెద్దల పైశాచిక వ్యాఖ్యలా.. చివరికి అక్టోబర్ 8న మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. కృష్ణ కుటుంబ సభ్యులు.. అమ్మాయి తరఫు వారు బలవంతం చేయడమో, లేదా ప్రేరేపించడమో వల్లే తమ కుమారుడు విషం తాగాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమంటే పవిత్రత, త్యాగం.. కానీ దాన్ని ఇంతటి భయంకరమైన పరీక్షతో నిరూపించుకోవాలని పెద్దలు కోరడం, దానికి అమాయకపు యువకుడు బలైపోవడం.. నిజంగా ఇది గుండెల్ని పిండేసే విషాదం.