మహారాష్ట్ర టెట్‌ పేపర్‌ లీక్‌  | Maharashtra TET Exam Postponed After Suspected Question Paper Leak | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర టెట్‌ పేపర్‌ లీక్‌ 

Jun 28 2026 1:01 AM | Updated on Jun 28 2026 1:01 AM

Maharashtra TET Exam Postponed After Suspected Question Paper Leak

నేడు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష వాయిదా

భివండీలో ముందే బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు.. 

ముందస్తు సమాచారంతో పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీల పరంపరకు పుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. సంచలనం రేపిన నీట్‌ లీకేజీ వ్యవహారం మరువక మునుపే తాజాగా మహారాష్ట్రలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం, ఈ నెల 28న జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (మహా–టెట్‌) 2026 ప్రశ్నపత్రం లీకైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

పోలీసుల ఆకస్మిక దాడులు.. 
మహారాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 కేంద్రాల్లో 6 లక్షల మంది అభ్యర్థులు హాజరు కావాల్సిన టెట్‌ పరీక్షకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే శనివారం తెల్లవారుజామున థానే జిల్లా పరిధిలోని భివండీలో కొందరి వద్ద టెట్‌ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. వెంటనే పోలీసులు భివండీలోని ఓ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో పరీక్షకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యం కావడంతో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 

ఎంఎస్‌సీఈ అధికారుల నిర్ధారణ 
అనుమానితుల వద్ద లభ్యమైన పత్రాలను పరిశీలించేందుకు పోలీసులు వెంటనే పుణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్‌సీఈ) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న విద్యాశాఖ, పరీక్షల మండలి అధికారులు ఆ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలు, ఆదివారం జరగాల్సిన అసలు టెట్‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పేపర్‌ లీకైనట్లు అధికారికంగా స్పష్టమైంది. 

త్వరలో కొత్త తేదీల ప్రకటన .. 
పేపర్‌ లీకైనట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది. ఈ స్థాయిలో పరీక్షను నిర్వహించేందుకు కనీసం మూడు వారాల సమయం అవసరమవుతుందని ఎంఎస్‌సీఈ డిప్యూటీ కమిషనర్‌ ప్రియా షిండే చెప్పారు. పారదర్శకతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

త్వరలోనే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే, అభ్యర్థులు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తదుపరి అధికారిక అప్‌డేట్స్‌ కోసం అభ్యర్థులు వేచిచూడాలని సూచించారు. కాగా, లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇలా చివరి నిమిషంలో పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ముగ్గురిపై క్రిమినల్‌ కేసు 
ఈ వ్యవహారంపై భివండీ పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు అనుమానితులపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ లీకేజీ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది.

యువత భవిష్యత్తును దోచుకోవడమే: రాహుల్‌ గాంధీ 
మహారాష్ట్ర–టెట్‌ను లీకేజీ ఆరోపణలతో వాయిదా వేయడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం పరీక్ష పత్రం లీక్‌ మాత్రమే కాదు..యువత భవితను దోచుకోవడమేనన్నారు. ‘మరో పేపర్‌ లీక్‌. మరో పరీక్ష రద్దు, ఈసారి మహారాష్ట్ర టెట్‌ వంతు..!’అంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. పరీక్షల విధానాన్ని వసూళ్ల దందాకు అడ్డాగా మార్చుకున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

మహారాష్ట్రలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు హర్షవర్ధన్‌ సప్కాల్‌ విమర్శించారు. లీకేజీ సూత్రధారులు అన్ని రకాలుగా ప్రభుత్వం రక్షణలను పొందుతున్నారన్నారు. లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పత్రమే లీకైనప్పుడు ఇక ఏ పరీక్ష కూడా సురక్షితంగా కానేకాదని ఎన్‌సీపీ(ఎస్‌పీ) వ్యాఖ్యానించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులకు వ్యవస్థలపై నమ్మకం కల్పించాలని పేర్కొంది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement