
ఈ ఫొటోలోని కుర్రాడు పేరు అనురాగ్ అనిల్ బోర్కర్. నీట్ యూజీ 2025 పరీక్షలో 99.99 పర్సంటైల్‌తో OBC విభాగంలో 1475 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ కుర్రాడు డాక్టర్ కావాలనుకోలేదు. అందుకే మెడిసిన్‌లో చేరడానికి ముందే ప్రాణాలు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు 19 ఏళ్ల అనురాగ్ ఇష్టం లేని చదువు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు.
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ ప్రాంతంలో అనురాగ్ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ యూజీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో అతడికి సీటు వచ్చింది. MBBS కోర్సులో చేరడానికి గోరఖ్‌పూర్ వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో అనురాగ్ అనూహ్యంగా తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు.
ఘటనా స్థలం నుంచి పోలీసులు అనురాగ్ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖను మీడియాకు చూపించలేదు. డాక్టర్ కావడం ఇష్టం లేకనే అతడు ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నవర్గావ్ పోలీసులు (Navargaon Police) దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనురాగ్ మరణంతో అతడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అనురాగ్ తెలివైన విద్యార్థి అని పొరుగువారు తెలిపారు. అతడి చెల్లి గత సంవత్సరం 12వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్‌గా నిలిచిందని వెల్లడించారు.
ఒత్తిడి నుంచి బయటపడండి
చదువుల విషయంలో చాలా మంది టీనేజర్లు ఒత్తిడికి గురవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. తల్లిదండ్రుల ఇష్టాలను కాదనలేక, తమకు ఇష్టంలేని చదువు చదవలేక నలిగిపోతున్నారు. చదువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవితంలో అది ఒక భాగం మాత్రమేనని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఒత్తిడికి గురైతే తమ సమస్య గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. ఒంటరితనం నుంచి బయటపడటానికి మార్గాలు వెతకాలి. మీకు దగ్గరలోని మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే హెల్ప్‌లైన్ నంబర్లలోనూ సంప్రదించి సహాయం పొందవచ్చు.
మహారాష్ట్రలో హెల్ప్‌లైన్‌లు
వాండ్రేవాలా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్ 9999666555 లేదా help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (సోమవారం- శనివారం: ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు)
BMC మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: 022-24131212 (24x7)