
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న అంటు వ్యాధి తిరిగి దేశంలో అంతకంతకూ ప్రభలుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరిందని కేంద్ర కోవిడ్ నియత్రణ విభాగం తెలియజేసింది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో 104 యాక్టివ్ కేసులు ఉండగా, వాటిలో 99 కేసులు గత వారంలోనే నమోదయ్యాయి.
మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. ముంబైలో కొత్తగా 35 కేసులు నమోదు కాగా, పూణేలో కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకూ మొత్తం 300 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 248 కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోని మొత్తం ఇన్ఫెక్షన్లలో 82.67 శాతం. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ(Kerala)లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తరువాత స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఢిల్లీలో కూడా నమోదవుతున్న కేసులలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి. వీటికి గృహ సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు.
సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్‌లో నమోదువున్న కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్-19 వేరియంట్ ఎన్‌బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్‌ఎప్.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) (డబ్ల్యూహెచ్‌ఓ) ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 సబ్‌వేరియంట్‌లను ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్‌లు ఇవేనని తెలిపింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20శాతం) ఉన్నాయి.
ప్రస్తుతం కోవిడ్-19 కేసులతో పోరాడుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ 430 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తరువాత 209 కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నాలుగు, కేరళలో రెండు, కర్ణాటకలో ఒకటి చొప్పున కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకూ అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ఎటువంటి యాక్టివ్ కేసులు నమోదు కాలేదు.
ఇది కూడా చదవండి: నీట్‌కు ప్రిపేర్ అవుతూ.. నెలలో రెండో ‘ఉదంతం’