
కోటా: రాజస్థాన్‌లోని కోటాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీట్‌కు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన విద్యార్థిని వైద్య విద్య ప్రవేశపరీక్ష ‘నీట్’కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాకు వచ్చింది. ప్రతాప్ చౌరాహాలోని పేయింగ్ గెస్ట్ రూమ్‌లో ఉంటూ, సొంతంగా నీట్(NEET)కు ప్రిపేర్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే ప్రతాప్ చౌరాహాలో ఉంటున్న జీషాన్(18) తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహావీర్ నగర్ పోలీస్ స్టేషన్(Police station) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కవియా తెలిపిన వివరాల ప్రకారం జీషాన్ ఆత్మహత్య చేసుకునే ముందు తన బంధువులతో మాట్లాడుతూ, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపింది. వెంటనే అప్రమత్తమైన వారు జీషాన్ ఉంటున్న భవనంలోనే ఉంటున్న మరో విద్యార్థిని మమతకు ఈ విషయం తెలియజేశారు.
వెంటనే మమత.. జీషాన్ గది వద్దకు చేరుకుంది. గది తలుపు లోపలి నుండి లాక్ చేసివుండటాన్ని గమనించిన ఆమె సహాయం కోసం స్థానికులను పిలిచింది. వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, జీషాన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా జీషాన్ ఇక్కడ కోచింగ్ కోసం నెల రోజుల క్రితమే వచ్చిందని, ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనూ చేరకుండా స్వయంగా నీట్‌కు సిద్ధమవుతున్నదని పోలీసులు తెలిపారు. ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెలలో ఇది రెండవ ఘటన.
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.
నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది.
ఇది కూడా చదవండి: Paper Airplane Day: నూతన ఆవిష్కరణలకు నాంది