
బాల్యంలో పేపర్‌తో ఎయిర్‌ప్లేన్ తయారు చేసి, ఆనందంతో చిందులు వేస్తూ, ఆడుకోని వారు ఎవరూ ఉండరు. గాలిలో ఎరురుతున్న విమానాన్ని అద్బుతంగా చూసే చిన్నారులు దాని నమూనాను తయారు చేయడంలోనూ పోటీ పడుతుంటారు. పేపర్ ప్లేన్(Paper plane)లను తయారు చేసి, పోటీలు పడుతూ విసురుకుంటారు. ఇలాంటి పేపర్ ప్లేన్‌లకు ఒక ప్రత్యేకమైన రోజు ఉందనే సంగతి మీకు తెలుసా? ఈ రోజు(మే 26) నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే. అందుకే ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే(National Paper Airplane Day) ప్రతి ఏటా మే 26న జరుపుకుంటారు. ఈ రోజు కాగితంతో తయారు చేసిన విమాన బొమ్మలను ఎగురవేస్తుంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, విమాన శాస్త్రం గురించి తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశంగా నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డేను నిర్వహిస్తుంటారు. కాగితపు విమానాల చరిత్ర ఎంతో పురాతనమైనది. రెండు వేల ఏళ్ల క్రితం చైనాలో కాగితంతో చేసిన విమానాల ఆవిష్కరణ మొదలయ్యింది.
చైనాలో క్రీ.పూ. 105లో కాగితంతో విమానాన్ని తయారు చేశారని చెబుతుంటారు. జపాన్‌లో కాగితం మడత పెట్టే కళ అయిన ఒరిగామి కాగితపు విమానాల తయారీకి ప్రేరణగా నిలిచిందని అంటారు. 19వ శతాబ్దంలో కాగితం విమానాలు శాస్త్రీయ పరిశోధనలకు ఉపయుక్తమయ్యాయి. రైట్ సోదరులు (విల్బర్, ఆర్విల్ రైట్) తమ విమాన రూపకల్పనలను పరీక్షించేందుకు కాగితం నమూనాలను ఉపయోగించారు. ఇది 1903లో ఇది వారి చారిత్రాత్మక విమానం తయారీకి దారితీసింది. కాగితం విమానాలు కేవలం బొమ్మలుగానే కాకుండా, విమాన శాస్త్రంలో ఆవిష్కరణలకు ఒక సాధనంగానూ సేవలందించాయి.
నేషనల్ పేపర్ ఎయిర్‌ప్లేన్ డే నాడు పలు దేశాల్లో పోటీలు(Competitions), అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2012లో జో అయూబ్ అనే వ్యక్తి రూపొందించిన కాగితం విమానం 226 అడుగుల 10 అంగుళాల (69.14 మీటర్లు) దూరం ఎగిరి రికార్డును సృష్టించింది. తాకువో తోడా అనే వ్యక్తి 27.9 సెకన్ల పాటు గాలిలో పేపర్ విమానాన్ని ఎగురవేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. నాసా లాంటి సంస్థలు కాగితం విమాన డిజైన్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాయి. మీరు కూడా ఈ రోజు చక్కని కాగితపు విమానాలను తయారు చేసి, గాలిలో ఎగువేసి ఆనందించండి.
ఇది కూడా చదవండి: Gaza: వైమానిక దాడుల్లో 9 మంది పిల్లలను కోల్పోయి.. ఐసీయూలో చేరిన వైద్యుడు