
గాజా: గాజాలో చోటుచేసుకున్న మరో విషాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రెండురోజుల క్రితం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన సైనికదాడిలో తన తొమ్మిది మంది సంతానాన్ని కోల్పోయిన వైద్యుడు ప్రస్తుతం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్(Intensive care)(ఐసీయూ) చికిత్స పొందుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.
గాజాకు చెందిన హమ్ది అల్-నజ్జర్ అనే వైద్యుడు తన 10 మంది పిల్లలతో పాటు ఖాన్ యూనిస్‌లోని తన ఇంట్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది చిన్నారులు మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన ఒక చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుగున్నాడు. ఇదే దాడిలో గాయపడిన డాక్టర్ హమ్ది అల్-నజ్జర్ ప్రస్తుతం దక్షిణ గాజాలోని సమీపంలోని నాజర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న అబ్దుల్ అజీజ్ అల్-ఫర్రా మాట్లాడుతూ డాక్టర్ నజ్జర్‌కు ఉదరం, ఛాతీలో అవుతున్న రక్తస్రావాన్ని నియంత్రించేందుకు రెండు ఆపరేషన్లు జరిగాయని, అతని తలకు కూడా తీవ్రగాయం అయ్యిదని తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) శుక్రవారం ఖాన్ యూనిస్‌పై వైమానిక దాడి చేసినట్లు ధృవీకరించింది. తమ ఆపరేషన్ ప్రారంభించే ముందు సైన్యం ఆ ప్రాంతం నుండి పౌరులను తరలించిందని పేర్కొంది. కాగా నజ్జర్ భార్య కూడా వైద్యురాలు. అయితే ఆమె దాడి సమయంలో ఇంటిలో లేరు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి చేరుకుని విగత జీవులుగా పడివున్న తన పిల్లలను చూసి షాకయ్యారు. తరువాత తేరుకున్న ఆమె యుద్ధంలో గాయపడిన పాలస్తీనియన్లకు చికిత్స అందిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన అనంతం ఈ యుద్ధం మొదలయ్యింది. తరువాత ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలించడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడమే లక్ష్యంగా ప్రతీకార దాడులు చేస్తూ వస్తోంది.
ఇది కూడా చదవండి: పార్టీ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం?.. కారణమిదే..