
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ దీనికి ప్రతీకార చర్యగా ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)ను విజయవంతంగా చేపట్టింది. అయితే పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన దాడులపై కొందరు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హెచ్చరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దీనిలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పార్టీ నేతలు అన్ని అంశాలపై మాట్లాడకూడదని, అసవసర ప్రకటనలు చేయవద్దని సూచించారని తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’పై కొందరు బీజేపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం సంచలనంగా మారింది. ఇది పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం జరిగిన ఒక బహిరంగ సభలో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా(Madhya Pradesh Minister Vijay Shah) మాట్లాడుతూ సాయుధ దళాల ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరుకోగా, న్యాయమూర్తులు సదరు మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విజయ్ షాను ‘ఉగ్రవాదుల సోదరి’ అని వ్యాఖ్యానించారు.
ఇదేవిధంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలను విమర్శించారు. వారిలో వీరోచిత లక్షణాలు లేకపోవడం కారణంగానే బాధితులుగా మిగిలిపోయారని ఎంపీ వ్యాఖ్యానించారు. హర్యానాలోని భివానీలో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జాంగ్రా మాట్లాడుతూ ‘భర్తలను కోల్పోయిన స్త్రీలలో యోధుల స్ఫూర్తి, ఉత్సాహం లేదని, వారు చేతులు ముడుచుకున్నందునే ఉగ్రవాదులు తెగబడ్డారని వ్యాఖ్యానించారు. పర్యాటకులు అగ్నివీర్ శిక్షణ పొందినట్లయితే కేవలం ముగ్గురు ఉగ్రవాదులు 26 మందిని చంపలేరని అన్నారు. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా, అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి శత్రువులతో పోరాడలేదా? మన సోదరీమణులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ సమాధానమిచ్చారు.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు.. జూన్ 19న