
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఒక పరీక్షా కేంద్రంలో నీట్–యూజీ,2025 ప్రవేశపరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా అసౌకర్యం కల్గిందని, ఆ కారణంగా పరీక్ష ఫలితాల విడుదలను నిలిపివేయాలన్న అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు సమ్మతించింది. ఈ మేరకు ఫలితాలను నిలిపివేయాలంటూ సంబంధిత అధికారులకు జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ అంశంలో తదుపరి వాదోపవాదనలను జూన్ రెండో తేదీన ఆలకిస్తామని బెంచ్ పేర్కొంది. చెన్నైలోని ‘పీఎం శ్రీ’కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్–అవడిలోని పరీక్షా కేంద్రంలో పలువురు అభ్యర్థులు ఈనెల నాలుగో తేదీన నీట్–యూజీ పరీక్షరాసేందుకు సిద్ధమవగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4.15 గంటలదాకా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా వెంటనే విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. అందుబాటులో ఎలాంటి జనరేటర్, ఇన్వెర్టర్లు లేవని 13 మంది అభ్యర్థుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ‘‘సరైన వెలుతురు లేకున్నా పరీక్ష రాయాల్సి వచ్చింది.
వర్షం నీరు పరీక్ష గదుల్లోకి చేరడంతో కేటాయించిన సీట్లోకాకుండా కాస్తంత దూరంగా జరిగి కూర్చుని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇంత అసౌకర్యం, అంతరాయం, సమయం వృథా అయినా ఈ అభ్యర్థులకు అధికారులు అదనపు సమయం కేటాయించలేదు. దీంతో మొత్తం ప్రశ్నలకు వాళ్లు సమాధానాలు రాయలేకపోయారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14 ప్రకారం చూస్తే ఇతర కేంద్రాల్లోని అభ్యర్థులతో పోలిస్తే వీళ్లకు సమాన అవకాశాలు, హక్కులు లభించలేదు. అందుకే ఈ విషయం తేలేవరకు పరీక్ష ఫలితాలను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వండి’’అని న్యాయవాదులు కోరారు.