పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం | West Bengal Lightning Strikes Claim 11 Lives Amid Heavy Rains And Thunderstorms, More Details Inside | Sakshi
Sakshi News home page

పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం

Jun 24 2026 7:35 AM | Updated on Jun 24 2026 10:36 AM

Lightning Strikes Havoc 11 Killed Across West Bengal Ferry Ghat Tragedy

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రకృతి కన్నెర్ర జేసింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం బీభత్సం సృష్టించగా.. వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ముర్షిదాబాద్-మాల్దా సరిహద్దులోని ఒక ఫెర్రీ ఘాట్ వద్ద ప్రయాణికులు ఆశ్రయం పొందుతున్న సమయంలో పిడుగు పడటంతో ఒకే చోట నలుగురు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది.

ఫెర్రీ ఘాట్ వద్ద ఊహించని ఘోరకలి
ముర్షిదాబాద్‌లోని ధులియాన్ నుండి మాల్దాలోని శోవాపూర్ వైపు 25 నుండి 30 మంది ప్రయాణికులతో వెళ్లిన ఒక పడవ భాగీరథి నదిని దాటి ఒడ్డుకు చేరింది. అప్పటికే తుఫాను తీవ్రం కావడంతో, ప్రయాణికులు నది ఒడ్డున ఉన్న ఒక పూరిపాక కింద తలదాచుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంపై పిడుగు పడటంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మాల్దా జిల్లాకు చెందిన అసదుల్లా షేక్ (80), అన్సార్ షేక్ (45), కొచ్చి షేక్ (25) మరియు సోరాపూర్‌కు చెందిన ఏక్రాముల్ షేక్ (80)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో జంగీపూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.

పొలాల్లో పనిచేస్తుండగా కాటేసిన మృత్యువు
మాల్దా జిల్లాలోని బైష్నాబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్‌పూర్ గ్రామంలో జనపనార పొలంలో పనిచేస్తున్న సలేక్ మియా (35), జహంగీర్ మియా (29) అనే ఇద్దరు సోదరులు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. అలాగే, కూచ్ బెహార్ జిల్లాలో పశువులను ఇంటికి తోలుకువస్తున్న మేనకా బర్మన్ (59) అనే మహిళతో పాటు, వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న అర్మాన్ హుస్సేన్ (20) అనే యువకుడు పిడుగుపాటుకు బలయ్యారు. పురూలియా జిల్లాలో కూడా వేర్వేరు చోట్ల కేశబ్ మహతో (48), ప్రతిమా మహతో (54) అనే ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఫోన్ మాట్లాడుతుండగా పోయిన ప్రాణం
ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని కాంచ్రాపారాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద సర్కార్ (38) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని మైదానంలో నిలబడి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతనిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement