
నాగుపామును ఆడించే మంత్రగాడు అదే పాము కాటుకు గురయ్యాడని సామెత. మన రాజకీయ నేతలు చేసే కొన్ని విన్యాసాలు భవిష్యత్తులో వారికే తలనొప్పిగా మారతాయన్నది వారు విస్మరిస్తుంటారు. తాజాగా కేంద్రం తీసుకు వస్తున్న చట్టం కూడా అదే తరహాలో ఉందా అనిపిస్తోంది. వినడానికి మాత్రం ఇది బాగుందే అనిపించవచ్చు. కాని పరిశీలిస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న సంగతి అర్థమవుతుంది.
ప్రధాని లేదా ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఎవరైనా ముప్పై రోజులు జైలులో ఉండవలసి వస్తే వారి పదవి ఆటోమాటిక్‌గా పోయే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చట్టం తీసుకువస్తోంది. ఈ చట్టాన్ని సడన్‌గా ఎందుకు తీసుకు వస్తున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీయేతర పక్షాలు ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించి ప్రభుత్వాలను అస్థిర పరచడానికి ఇది ఒక ఆయుధం అవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. తమ మిత్రపక్షాలలో ఎవరైనా తోక ఝాడిస్తున్నారన్న అనుమానం వచ్చినా వారిపై కూడా ఈ అస్త్రం ప్రయోగించవచ్చన్న అభిప్రాయాన్ని విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రత్యేకించి కేంద్రంలో పూర్తి మెజార్టీ లేని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లను కట్టడి చేయడానికి కూడా దీన్ని వాడవచ్చని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుపై టీడీపీ, జేడీ(యూ)లు కూడా మథన పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్రం చిత్తశుద్దితోనే చేస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.కాని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటీవలికాలంలో పెడదోరణులు ప్రబలిపోయాయి.
తమ ప్రత్యర్దులను ఎలాగైనా అణచివేయాలని, తద్వారా శాశ్వతంగా తామే అధికారంలో ఉండాలన్న తాపత్రాయం మన నాయకులలో అధికంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎంతకాలం పాలనలో ఉన్నా ఫర్వాలేదు. అలా కాకుండా నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తుండడమే ఇబ్బందిగా మారుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్లు జైలు శిక్షకు గురైతే వెంటనే అతను పదవికి అనర్హుడవుతాయన్నది దాని సారాంశం. దానివల్ల అనర్థాలు రావచ్చని తలంచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ తీర్పును రివర్స్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
కానీ అప్పట్లో రాహుల్ గాంధీ అవగాహనా రాహిత్యంతో ఆ ఆర్డినెన్స్ కాపీని బహిరంగంగానే చించివేశారు. ఒక రకంగా ఇది తన ప్రభుత్వాన్ని తానే అవమానించుకున్నట్లు కాదా! పైగా ఆనాటి ప్రదాని మన్మోహన్ సింగ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో వచ్చిన ఆ ఆర్డినెన్స్ పూర్వాపరాలు ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించడంతో ఆ తీర్పు అమలులోనే ఉంది. దాని ఫలితంగా కొందరు తమ పదవులు కోల్పోయారు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష పడడంతో రాజ్యసభ సభ పదవి పోయింది. ఆ తర్వాత కాలంలో రాహుల్ గాంధీనే ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్షకు గురి కావడం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం జరిగిపోయింది. తదుపరి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి పునరుద్దరించుకోగలిగారు. అది వేరే సంగతి.
రాహుల్ ఈ ఉదంతంలో తాను చేసిన తప్పుకు తానే బలైనట్లే కదా! ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రయోగం చేస్తోందా? ఒకవేళ వేరే ప్రభుత్వం కేంద్రంలో వస్తే ,అప్పుడు ఇదే చట్టం బీజేపీ ప్రభుత్వాల మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభలో మాట్లాడుతూ నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా? అని ప్రశ్నించారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంంటూ హడావుడి చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కొందరు మంత్రులను అరెస్టు చేశారు. డిల్లీలో పోలీస్ వ్యవస్థ కేంద్రం చేతిలోనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండా జైలులో ఉంటూనే ప్రభుత్వ విషయాలపై ఆదేశాలు ఇస్తుండేవారు. అలాగే తమిళనాడుకు చెందిన ఒక మంత్రిని ఈడి అరెస్టు చేసింది. ఆయన కూడా పదవికి రాజీనామా చేయకుండా కేబినెట్‌లో కొనసాగారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా లేనివి. ఢిల్లీలో ఎన్నికలకు ముందు ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో బీజేపీ నాయకత్వం లిక్కర్ స్కామ్ పేరుతో కేజ్రీవాల్ ను జైలులో పెట్టిందని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించేది. ఇలా కొద్దిమందిని దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం తెస్తుండడం కరెక్టేనా అన్న చర్చ ఉంది.
నిజంగానే మోడీకి అవినీతి వ్యవహారాలపై చిత్తశుద్ది ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మోడీని అవినీతిపరుడని, టెర్రరిస్టు అని.. ఇంకా చాలాచాలా మాటలు టీడీపీ అధినేత, 2019 ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విమర్శించేవారు. మోడీ స్వయంగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే చంద్రబాబు దానిని తనకు ఏటీఎం గా మార్చుకున్నారని ఆరోపించారు. ఎన్నికలలో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన పీఎస్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరపగా వివిధ కాంట్రాక్టు వ్యవహారాలలో రెండువేల కోట్ల అక్రమాలు జరిగాయని తేలినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది.
అప్పటికే కేంద్రానికి చెందిన ఈడీ అదే కేసులో పలువురిని అరెస్టు చేసింది. చంద్రబాబు వరకు కేసును ఈడీ తీసుకు రాలేదు.ఈలోగా టీడీపీతో మళ్లీ బీజేపీ జత కట్టింది. మరి ఇప్పుడు ఆ ఆరోపణలు సంగతేమిటి? అసలు ఆ కేసులలో నిజానిజాలు ఏమిటి? అన్యాయంగా చంద్రబాబు మీద ఆ ఆరోపణలు చేశారా?లేక వాస్తవం ఉందా? అన్నది ప్రజలకు తెలియనవసరం లేదా? తన ప్రభుత్వ ఓటమి తర్వాత చంద్రబాబు ఈ పరిణామాలను ఊహించే తెలివిగా బీజేపీ పెద్దలతో రాజీ చేసుకున్నారన్నది చాలా మంది భావన. ఆ తర్వాత బతిమలాడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నది బహిరంగ రహస్యమే.ఇలాంటివాటి గురించి మోడీ జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి, తమ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీ(యూ)లను తమ అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి చట్టం తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
దానికి తగినట్లుగానే టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు కృష్ణదేవరాయలు ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోపాలను సరిదిద్దాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరుగుతుందని అన్నారు. అంటే ఈ బిల్లుపై వారు లోపల భయపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. జేడీ(యూ) నేత త్యాగి కూడా అదే తరహాలో స్పందించారు. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఉన్నా, లేకపోయినా, చంద్రబాబు విషయంలో బీజేపీ అనుసరించిన ద్వంద్వ విధానం సహజంగానే ఈ సందేహాలకు తావిస్తుంది.ఇండియా కూటమి లోనే అవినీతిపరులు ఉన్నట్లు తమ పక్షంలో ఎవరూ లేనట్లు మోడీ మాట్లాడినా జనం ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అవినీతి ఆరోపణలు వచ్చినా ఎందరిపై కేసులు పెడుతున్నారు? దేశ ప్రధాని మీద కేసు పెట్టే పరిస్థితి ఉందా? అలాగే ముఖ్యమంత్రి మీద కూడా రాష్ట్ర స్థాయిలో కేసులు పెట్టడం తేలిక కాదు. కాకపోతే న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని కేంద్రం లోని అధికార పార్టీ తమ వ్యతిరేక పార్టీల సీఎం లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు.
మరో ఉదాహరణ చూద్దాం. దశాబ్దాల కిందట కేంద్రం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చింది. అయినా దాని అమలు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇదే మోడీ ప్రభుత్వం ఇందులో ద్వంద ప్రమాణాలు పాటించడం లేదా? సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ జేడీ(యూ) పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీ(యూ) కోరింది.దానిని ఆఘమేఘాల మీద ఆమోదించి అనర్హత వేటు వేసేశారు. తమ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆయనను అనర్హుడిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ స్పీకర్ ను కోరింది. మొత్తం టర్మ్ పూర్తయ్యింది కాని, ఆ పిటిషన్‌ను తేల్చలేదు. ఇంకా పలు ఉదాహరణలు ఇలాంటివి ఉన్నాయి.
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 2014-19 మధ్యకాలంలో ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక్కరిపై కూడా చర్య తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ అటు శాసన వ్యవస్థలోను, ఇటు న్యాయ వ్యవస్థలోను పోరాడుతోంది. ఇంతవరకు అదేమీ తేలలేదు. అలాగే అంతకుముందు టర్మ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. వారిపై అప్పటి స్పీకర్ చర్య తీసుకోలేదు.పైగా వారంతా బీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు ప్రకటించారు. కేంద్రంలోను, వివిధ రాష్ట్రాలలోను పరిస్థితులు ఇలాఉంటే ఇప్పుడు కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టం ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తుందా అన్న భయం అందరిలో ఉంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత