
అమెరికా 50% టారిఫ్‌లపై మోదీ స్పష్టీకరణ
‘ఆర్థిక’ సమస్యకు పరిష్కారం కనుగొంటామని హామీ
అహ్మదాబాద్: అధిక పన్నుల భారం మోపినా భరిస్తాంగానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమెరికా మోపిన 50 శాతం దిగుమతి టారిఫ్ భారంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సోమవారం సొంతరాష్ట్రంలో పర్యటన ఆరంభించిన ప్రధాని మోదీ రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.
తర్వాత అహ్మదాబాద్‌లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజ నాలే భారత్‌కు ముఖ్యం. అదనపు టారిఫ్‌ల పేరిట మాపై పెనుభారం మోపినా భరిస్తాం. అంతేగానీ స్వప్రయోజనాలను పణంగా పెట్టబోం’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ భారత్‌పై విదేశీ ప్రభావాన్ని మోదీ ప్రధా నంగా గుర్తు చేశారు.
‘‘ ప్ర పంచ దేశాల్లో నేడు రాజకీ యాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూతా తిరుగుతున్నాయి. అయినా సరే నేను మహాత్మా గాంధీజీ చూపిన స్వదేశీ వస్తువు లకు పట్టం కట్టాలనే బాటలోనే పయనిస్తున్నా. అందుకే చిన్నపరిశ్రమలు, కర్షకులు, పశుపోష కులకు నేనొక్కటే చెప్పదల్చు కున్నా. మీ ప్రయోజ నాలే నాకు సర్వోన్నతం. మీ ప్రయోజనాల విష యంలో మా ప్రభుత్వం ఏమాత్రం పట్టు సడలించదు. మాపై ఎంతటి ఒత్తిడి పడినా సరే మేం భరిస్తాం. మీ ప్రయో జనాలకు భంగం కల్గకుండా చూసుకుంటాం’’ అని మోదీ అన్నారు.
చక్రధారి, చరఖాధారి బాటలో..
‘‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ, శక్తిసామర్థ్యాలకు, పరి రక్షణకు మారుపేరైన సుదర్శన చక్రధారి అయిన మోహన్ కృష్ణ భగవానుడు, ఛరఖాధారి అయిన మోహన్ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో భారత్ పయనిస్తోంది. నూలు వడికే రాట్నం చక్రంతో గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ఉరకలెత్తించారు. పహల్గాంలో ఉగ్ర ముష్కరుల పాశవిక దాడికి దీటుగా బదులిస్తూ భారత సైనికుల తెగువ, ధైర్య సాహసాలకు దర్పణమే ఆపరేషన్ సిందూర్’’ అని మోదీ అన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శల జడి
‘‘60 నుంచి 65 ఏళ్లపాటు భారత్‌ను పాలించిన కాంగ్రెస్ కూడా ‘దిగుమతి స్కామ్’లకు పాల్పడి భారత్‌ను పరాయి దేశాలపై సరుకుల కోసం ఆధారపడేలా మార్చేసింది. పరాధీనంగా మార్చేసి బాపూజీ కీలక ఉపదేశమైన స్వదేశీ మంత్రాన్ని కాంగ్రెస్ మంటగల్పింది. గాంధీజీ పేరు చెప్పుకుని తిరిగే కాంగ్రెస్ పెద్దలు ఆయన సూచించిన స్వచ్ఛత, స్వదేశీ పదాలను గాలికొదిలేశారు’’ అని మోదీ విమర్శించారు.