
న్యూఢిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్యాన్నే కాదు.. మొత్తం వ్యవస్థనే అపహాస్యం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీఛార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం నెలలుగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేయగా.. చాలా మంది గాయపడ్డారు.
కవర్ చేయడానికి వచ్చిన మీడియానూ అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ‘అభ్యర్థుల చెప్పేది వినడానికి బదులుగా, రాత్రి చీకటిలో వారిని లాఠీలతో కొట్టారు. ఊహించుకోండి... నిన్న పుస్తకాలు పట్టుకున్న చేతులకు ఇప్పుడు గాయాల గుర్తులు మిగిలాయి’అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీజేపీ నియంతృత్వం చూడండి... దేశంలో దుండగులు బహిరంగంగా రాజ్యమేలుతున్నారు.
బీజేపీని ప్రశ్నించే వారిపై లాఠీ ఛార్జీలు ఝుళిపించి నోరు మూయిస్తున్నారు. ఎవరినైనా అరెస్టు చేసి జైలులో పెట్టవచ్చు, ఏ చట్టాన్నైనా వారు కోరుకున్నప్పుడల్లా మార్చవచ్చు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయకపోతే, వారి ఓటు తీసేస్తారు’అని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ.. మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని వివిధ పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహించే ఒక చట్టబద్ధమైన సంస్థ.
జూలై 24 నుంచి ఆగస్టు 1 మధ్య 142 నగరాల్లోని 194 కేంద్రాల్లో 13 ఫేజుల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. అయితే.. ఆకస్మిక రద్దులు, సాఫ్ట్‌వేర్ క్రాష్‌లు, బయోమెట్రిక్ ధ్రువీకరణలో వైఫల్యాలు, తప్పుడు సెంటర్ కేటాయింపుల వంటి సమస్యలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యలపై ఢిల్లీ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ఆశావహులు వీధుల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలోనూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని, అక్రమాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.