
న్యూఢిల్లీ: ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు మరో 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. ఆస్పత్రుల నిర్మాణ అవకతవకలకు సంబంధించిన నేపథ్యంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఆప్ పాలనలో సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆస్పత్రుల నిర్మాణాల్లో అవకతకవలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో మరో మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ని సైతం దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.

అభియోగాలేంటంటే..
2018-19లో ఆప్ ప్రభుత్వం రూ. 5,590 కోట్ల విలువైన 24 ఆసుపత్రుల ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల్లో అనేక ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల, మరియు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో ICUలతో కూడిన ఆసుపత్రులు 6 నెలల్లో పూర్తవ్వాల్సి ఉండగా, 3 సంవత్సరాలు గడిచినా 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్‌ఎన్‌జీపీ ఆసుపత్రి ఖర్చు రూ. 488 కోట్ల నుంచి రూ. 1,135 కోట్లకు పెరిగింది, కానీ దాని నిర్మాణంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. పైగా అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం, అదే సమయంలో కాంట్రాక్టర్ల పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే Hospital Information Management System (HIMS) 2016 నుంచి పెండింగ్‌లో ఉంది, దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణల నేపథ్యంతో.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ 2025 జూన్‌లో సత్యేందర్ జైన్ , సౌరభ్ భరద్వాజ్‌లపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కేసును ఈడీకి బదలాయించగా.. విచారణ జరుగుతోంది.