
వారి త్యాగం ఊరికే పోదన్న సీఎం చంద్రబాబు
ఎన్ని ఎకరాల్లో అయినా రాజధాని కడతాం
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే
రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరాం
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడటం నిజమే. అయినా వారి త్యాగం ఊరికే పోదు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన చరిత్ర అమరావతిది. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని కడతాం. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తే నీకు (మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) వచ్చిన నష్టం ఏమిటి?’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం జన్‌పథ్–1లోని అధికారిక నివాసంలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని, అలా రాకపోతే ఎలా.. అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరినట్లు చెప్పారు.
ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని, రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు.
జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉందని, ఇక్కడ క్లస్టర్‌ను మిస్సైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
పోలవరం–బనకచర్ల ప్రతిపాదన
రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వివరించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
షార్, లేపాక్షి వద్ద స్పేస్ సిటీల అభివృద్ధి విషయంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలసి మాట్లాడానని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ పోషించగల పాత్రను వివరిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదిక సమర్పించానని చెప్పారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ల పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయంపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ‘అవునా? ఎప్పుడు? ఏమో మరి.. నాకు దాని గురించి తెలియదు’ అంటూ దాటవేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై కూడా తాను మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు.