
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.
కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు.
మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.
ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్‌లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.
అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.
కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.
గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.
ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు.
వైఎస్ జగన్ పై కాంగ్రెస్‌తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.
ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్‌లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.