
మేడిపల్లిలో పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం
పెంచిన తల్లిదండ్రులదీ కడుపుకోతేనన్న ధర్మాసనం
కోర్టు ధిక్కార పిటిషన్‌పై మరోసారి తేల్చిచెప్పిన సుప్రీం
కోర్టు ఆదేశాల మేరకు దత్తత తల్లిదండ్రులకే పిల్లలను ఇచ్చేసిన యంత్రాంగం
సాక్షి, న్యూఢిల్లీ: ‘కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకుని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపుకోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్దిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా.. ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ.. సెప్టెంబర్ 2న వర్చువల్‌గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు..: తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మాతా, శిశు సంక్షేమ శాఖ డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఇందులో డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన దాసరి అనిల్ కుమార్ కుటుంబంతోపాటు మరో ముగ్గురు దంపతులు సుప్రీంకోర్టులో అప్పీల్‌చేశారు.
ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే 14వ తేదీలోగా పిల్లల్ని ఇవ్వాలని ఈ నెల 12న తుది తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పును అధికార యంత్రాంగం పాటించడం లేదంటూ ఆ తల్లిదండ్రులు ఈనెల 18న ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
తాము ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ నాగరత్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల లోపు కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. అయితే, తమకు మంగళవారం ఉదయం 11గంటల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు ఏఎస్‌జీ కోరారు. ‘సరే ఈ ఒక్కసారికి అవకాశమిస్తున్నాం, మంగళవారం ఉదయం 11గంటలకల్లా తల్లిదండ్రుల చేతిలో ఆ పసికందులు ఉండాలి’అని జస్టిస్ నాగరత్న ఆదేశించారు. ఇదిలాఉండగా.. సోమవారం సాయంత్రంలోపే పిల్లలను ఆ తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడం గమనార్హం.
ఇదీ జరిగింది..
గత ఏడాది మేలో మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పిల్లల అక్రమ రవాణా, విక్రయం వ్యవహారం బట్టబయలైంది. మహిళా ఆర్‌ఎంపీ ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు గుర్తించి పోలీసులు 11 మందిని అరెస్ట్‌చేశారు. వారు మొత్తం 16 మంది చిన్నారులు (నలుగురు మగ, 12 మంది ఆడ పిల్లల్ని) అమ్మినట్లు గుర్తించారు. ఏడుగురు చిన్నారులను అమ్మకం దశలోనే పట్టుకోగా, మరో 9 మందిని కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొని మాతా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు.
వీరిని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) ద్వారా ప్రభుత్వం దత్తత ప్రక్రియలో పెట్టింది. వీరిలో అమ్మకం దశలో దొరికిన ఆరుగురు చిన్నారులను పేరెంట్స్ దత్తత తీసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చిన 9 మంది చిన్నారులను కూడా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని, తదుపరి రోజు తీసుకోవాల్సి ఉండగా, హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇందులో నలుగురు మాత్రమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరికి మాత్రమే తాజా తీర్పు వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురికి సంబంధించిన కేసు ఈ నెల 28న హైకోర్టు ముందుకు రానుంది.