
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సూపర్ వ్యాఖ్య చేశారు. ‘‘ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులు గట్టిగా పనిచేస్తే నేరాలు చేసేవారు రాష్ట్రం వదలివెళ్లిపోతారు..కానీ ఏపీలో పోలీస్ అధికారులు రాష్ట్రం విడిచిపోతున్నారు..’’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అరాచక పరిస్థితికి ఇది దర్పణం పడుతుంది. జగన్ బుధవారం వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు, సూపర్ సిక్స్‌సహా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అమలు కాని వైనం, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్న తీరులపై సాకల్యంగా మాట్లాడారు. వాటిలో ఈ కామెంట్ చాలా అర్ధవంతంగా ఉందని చెప్పాలి.
ఏపీలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కొందరైతే రాష్ట్రం నుంచి ఎలాగొలా బయటపడి కేంద్రానికి వెళదామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇవ్వడం లేదు. దాంతో ఈ చికాకులు తట్టుకోవడం ఇష్టం లేక కొందరు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. సిద్దార్ధ్ కౌశల్ అనే యువ అధికారి రాష్ట్రంలో పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగానికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఇది ఏపీ పరువు తీసేదిగా ఉంది. మరికొందరు అధికారులను పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం ఉండనే ఉంది.
గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అభియోగాల మీద దర్యాప్తు చేసి అనేక విషయాలు వెల్లడించి కేసులు పెట్టిన అధికారులు కొంతమందిని ఏదో సాకుతో సస్పెండ్ చేశారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు అనే డీజీ స్థాయి అధికారిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఇవన్ని చర్చనీయాంశాలుగా ఉన్న తరుణంలో జగన్ మీడియా ముఖంగా మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
డీఐజీ స్థాయి అధికారులు కొందరు మాఫియా మాదిరి మారారని, ప్రభుత్వంలోని పెద్దల కోసం కొంతమంది సీఐల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన హయాంలో ప్రజలకు ఉపయోగపడే స్పందన వంటి కార్యక్రమాలు తీసుకువచ్చి పోలీసు శాఖకు మంచిపేరు తెస్తే, ఇప్పుడు వారితో అరాచకాలు చేయిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన వారితోపాటు జర్నలిస్టులను కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను ప్రస్తావించారు.
గుడివాడలో జెడ్పీ ఛైర్‌పర్సన్ హారికపై టీడీపీ గూడాలు దాడి చేస్తే కేసులు పెట్టకపోగా, వాహనంలో వెనుక సీటులో ఉన్న హరిక భర్త రాముపై కేసు పెడతారా? అని ప్రశ్నించారు. మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టిస్తే కనీసం చర్య తీసుకోరా? అని ప్రశ్నించారు. వీటిపై అటు ప్రభుత్వ పెద్దలుకాని, ఇటు పోలీసు అధికారులూ వివరణ ఇవ్వలేకపోతున్నారు.
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేని తన ఇంటికి వెళ్లనివ్వడం లేదని, ఇదేమి పోలీసు వ్యవస్థ అని ఆయన ప్రశ్నించారు. నిజంగానే ఏ పోలీస్ వ్యవస్థకైనా, ప్రభుత్వానికైనా ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? అన్నదానిపై అంతా ఆలోచిస్తున్నారు. ఎవరో ఒకరి వాంగ్మూలం తీసుకోవడం, కేసు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం నిత్యకృత్యమైందని, అవకాశం వస్తే చంద్రబాబు సర్కార్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లపై కూడా కేసులు పెట్టగలదని జగన్ విమర్శించారు.
ఈ సందర్భంగా 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ జరిగిన మత కలహాలపై ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. మోడీ హైదరాబాద్‌కు రానివ్వనని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లో ప్రధాని మోడీని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగతంగా నిందించారు. కానీ 2024 నాటికి ఎలాగొలా బతిమలాడుకుని మళ్లీ వారితోనే పొత్తుపెట్టుకున్నారు.
మీడియా సమావేశంలో జగన్ ఇంకో ఘాటు వ్యాఖ్య చేశారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు తమ పార్టీ వారు ఇదే సంస్కృతిని అనుసరిస్తే టీడీపీ వారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జగన్ ఇలా మాట్లాడుతున్నప్పుడు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా, కొద్ది కాలానికే మళ్లీ యథాప్రకారం రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తోంది. దానివల్ల దేశ వ్యాప్తంగా ఏపీ ఇమేజీ దెబ్బతింటోంది. వైసీపీని అణచివేస్తే తామే ఎల్లకాలం పాలించవచ్చన్న భ్రమతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనిపిస్తుంది. కాని చరిత్రలో ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదన్న సంగతి పలుమార్లు రుజువైనా అధికారంలో ఉన్నవారు భ్రమలలో బతుకుంటారనుకోవాలి.
ఏపీలో ప్రతిపక్షంగా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉందని, ప్రజల పక్షాన తాము పని చేస్తున్నామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నందునే ప్రభుత్వం భయపడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తమ సమస్యలు తీర్చుతారన్న నమ్మకం లేకే జనం ఆయన వద్దకు వెళ్లడం లేదని కూడా జగన్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేశ్ పర్యటనలలో ఆశించిన స్థాయిలో ప్రజలు కనిపించడం లేదని అంటారు. అదే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక కూటమి హామీల గురించి ప్రశ్నిస్తూ, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ప్రకటించిన రూ.18 వేల సంగతి ఏమిటి? ఏమైంది? నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతులకు ఇస్తామన్న రూ.20 వేల మాట ఏమిటి? మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏమి చేశారు? ఎన్నికలకు ముందేమో రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారని, ప్రస్తుతం మాట మార్చి జిల్లా పరిధి అంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. ఏభై ఏళ్లకే ఫించన్ హామీతో సహా 143 హామీల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంతమేర ఎగవేసింది, లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
సహజమే కదా! ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను పదే, పదే గుర్తు చేస్తే వారు భరించగలుగుతారా? ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచిస్తే ఏ పార్టీ వారి కార్యక్రమాలకు అడ్డు తగలరు. కాని చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైసీపీ సభలు, సమావేశాలు సరిగా జరగకుండా చూడడానికి యత్నిస్తోంది. ఇవన్ని భవిష్యత్తులో చెడ్డ సంప్రదాయాలుగా మారతాయి. జగన్ దానినే ఒకటికి రెండుసార్లు వివరిస్తున్నారు.
ఒక వైపు హామీలు సజావుగా అమలు చేయకుండా, మరో వైపు కరెంటు ఛార్జీల రూపేణా సుమారు రూ.18 వేల కోట్ల భారం మోపారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే,పదే తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని కూడా ఊరించారు. తీరా పవర్ వచ్చాక ప్రజలు వాడుకునే పవర్ ఛార్జీలు మాత్రం ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏది ఏమైనా జగన్ వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకే చంద్రబాబు సర్కార్ తీవ్ర అసహనానికి గురి అవుతోంది. తమది మంచి ప్రభుత్వమని ప్రచారం చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యమైతే, ఇది మంచి ప్రభుత్వం కాదని, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదని జగన్ పదే,పదే రుజువు చేస్తున్నారు.అదే అసలు సమస్య.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత