రికార్డు స్థాయి వర్ష బీభత్సం.. నీట మునిగిన కోల్‌కతా | Kolkata Submerged: Flash Floods and Gridlock Leave Five Dead | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయి వర్ష బీభత్సం.. నీట మునిగిన కోల్‌కతా

Sep 23 2025 10:31 AM | Updated on Sep 23 2025 10:55 AM

Kolkata Submerged: Flash Floods and Gridlock Leave Five Dead

కోల్‌కతా: ఎడతెరిపి లేకుండా.. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి నగరం నీట మునిగింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు వేర్వేరు చోట్ల విద్యుత్‌ షాక్‌ ఘటనలతో  ఐదుగురు మృతి చెందారు. దుర్గా పూజ(Durga Puja) వేళ.. నగరంలో చాలా చోట్ల దేవీ మండపాలు నీట మునిగినట్లు సమాచారం.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా(Kolkata)లో సోమవారం నుంచి కురిసిన వానకు.. నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఐఎండీ నివేదిక ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే.. గారియా కమదహారి ప్రాంతంలో 332 మి.మీ., జోధ్‌పూర్ పార్క్ వద్ద 285 మి.మీ., కాళీఘాట్ ఏరియాలో 280 మి.మీ, టాప్సియా వద్ద 275 మి.మీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. 

కోల్‌కతాలో కురిసిన అతి భారీ వర్షం(Kolkata Heavy Rains) కారణంగా విద్యుత్ షాక్‌తో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. నేతాజీ నగర్, కాళికాపూర్‌, మొమిన్‌పూర్, బాలిగంజ్ ప్లేస్, బెనియాపుకూర్ ఏరియాలో.. ఒక్కొక్కరి చొప్పున చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలతో.. అధికారులు చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి మరమ్మత్తులు చేశారు. 

ప్రధాన రహదారులు నీట మునిగిపోవడంతో  ట్రాఫిక్‌ రద్దీ నెలకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ధాటికి.. హౌరా, సీల్దా, చిట్‌పూర్‌ రైల్వే స్టేషన్లు నీట మునిగిపోయాయి. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మెట్రో సేవలకు కూడా అంతరాయం కలిగింది. కోల్‌కతా మెట్రో సేవలు కూడా ప్రభావితమయ్యాయి.  కోల్‌కతా విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దుర్గా మండపాలు దెబ్బ తినడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు..

కోల్‌కతాకు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ అంటోంది. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని,గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ 24 పరగణా జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరో ఏడు జిల్లాలకు యెల్లో అలర్ట్‌ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి: అయ్యప్ప చుట్టూ రాజకీయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement