మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్‌ నేత | Kerala Mla Resists As Congress Leader Tries To Hug Her | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్‌ నేత

May 7 2026 7:21 PM | Updated on May 7 2026 8:00 PM

Kerala Mla Resists As Congress Leader Tries To Hug Her

తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్‌ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ..  లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.

అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక్కసారిగా షాక్‌..
బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె ఒక ఎమ్మెల్యే..
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement