
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ, కర్ణాటక క్రికెట్ ఆసోసియేషన్ కారణమని పేర్కొంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఐపీఎల్‌లో ఆర్సీబీ విజయానికి క్రెడిట్ కొట్టేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దుర్ఘటనలకు మాత్రం ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. క్రెడిట్ సొంతం చేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరాటపడ్డారని చెప్పారు. ఆర్సీబీ యాజమాన్యంతోపాటు శివకుమార్, కర్ణాటక ప్రభుత్వ అధికారుల పిలుపు మేరకు భారీగా జనం తరలివచ్చారని అరవింద్ బెల్లాద్ గుర్తుచేశారు.
చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయోత్సవాలకు హాజరు కావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది డి.కె.శివకుమార్ కాదా? అని ప్రశ్నించారు. దుర్ఘటనకు ఆర్సీబీ కారణమైతే పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని నిలదీశారు. 11 మంది మరణానికి కారణమైన తొక్కిసలాటకు కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరొకరిపై నిందలు వేసి తప్పించుకోవాలని చూడడం సరైంది కాదన్నారు.