ప్రజాస్వామ్య మార్గాల్లోనే ప్రభుత్వ మార్పు | Kapil Sibal rejects Mohan Bhagwat regime change remarks | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య మార్గాల్లోనే ప్రభుత్వ మార్పు

Oct 25 2026 6:42 AM | Updated on Oct 25 2026 6:42 AM

Kapil Sibal rejects Mohan Bhagwat regime change remarks

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు అభ్యంతరం  

రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ మార్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ఖండించారు. భారతదేశం ప్రజాస్వామ్య మార్గాల ద్వారా ప్రభుత్వ మార్పును కోరుకుంటోందని, అయితే సంఘ్‌ అధినేత దీనిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. దేశానికి మార్పు కచ్చితంగా అవసరమని, ఆ మార్పు జరగాలని ప్రజలు నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. 

మార్పు ఎప్పుడు, ఎలా జరుగుతుందో కాలమే చెబుతుందని అన్నారు. కపిల్‌ సిబల్‌ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ మార్పు ఎప్పుడు జరిగినా అది శాంతియుతంగానే జరుగుతుందని స్పష్టంచేశారు. మన దేశంలో ప్రభుత్వ మార్పు కోసం వస్తున్న పిలుపులను నేపాల్, బంగ్లాదేశ్, అల్బేనియా, ఫ్రాన్స్‌ దేశాల్లో ఇటీవల జరిగిన పరిణామాలతో మోహన్‌ భాగవత్‌ పోల్చడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. అటువంటి పోలికను తీసుకురావడం సరైంది కాదన్నారు. అది అభ్యంతకరమని చెప్పారు. 

ఇతర దేశాల్లో బహిరంగ తిరుగుబాట్లు చివరికి హింసకు దారితీశాయని, అలాంటి హింసను మనలో ఎవరూ సమర్థించరని కపిల్‌ సిబల్‌ తేల్చిచెప్పారు. భారతదేశం కోరుకుంటున్నది ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రభుత్వ మార్పును మాత్రమేనని వివరించారు. మోహన్‌ భాగవత్‌కు ఈ విషయం తెలిసినప్పటికీ, ఆయన దానికి అంగీకరించడం లేదని ఆక్షేపించారు. జంతర్‌ మంతర్‌ వద్ద యువత శాంతియుత నిరసనలు చేపట్టారని పేర్కొన్నారు. నిరసన సమయంలో జరిగిన హింసకు బయటి శక్తులే కారణమని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రస్తుత ప్రభుత్వాన్ని, రాజకీయ వ్యవస్థను మార్చడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement