రైలు ప్రయాణికుల భద్రతకు అత్యాధునిక నిఘా | Indian Railways Strengthens Passenger Safety | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికుల భద్రతకు అత్యాధునిక నిఘా

Oct 25 2026 6:37 AM | Updated on Oct 25 2026 6:46 AM

Indian Railways Strengthens Passenger Safety

దీపావళి, ఛఠ్‌ పండుగల వేళ రద్దీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు, నేరాల నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో ముగిసిన 8వ అఖిల భారత ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) చీఫ్‌ల సదస్సు రైల్వే భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, నిఘా ఆధారిత పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించింది. 

మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ సతీశ్‌ కుమార్‌ సూచించారు. ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించడం, మర్యాదపూర్వక పోలీసింగ్, సాంకేతికత వినియోగం ద్వారా సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు. 

నిఘా ఆధారిత పోలీసింగ్‌తో రైల్వే భద్రతను మరింత పటిష్ఠం చేయాలని ఆర్‌పీఎఫ్‌ డీజీ సోనాలి మిశ్రా సదస్సు ముగింపు సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగు పరిచేందుకు జీఆర్పీ సిబ్బందిని ‘రైల్‌ మదద్‌’ వేదికలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. దీనివల్ల ఫిర్యాదుల పర్యవేక్షణ, సమాచారం సకాలంలో చేరవేయడం, సమస్యల పరిష్కారంలో సమన్వయం పెరుగుతుందని తెలిపారు.

డ్రోన్లతో పింక్‌ పెట్రోల్‌.. పిల్లలకు భద్రతపై అవగాహన
దీపావళి, ఛఠ్‌ వంటి పండుగల సమయంలో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు ఢిల్లీ డివిజన్‌లో ఉత్తర రైల్వే చేపడుతున్న చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఢిల్లీ పోలీసులు, జీఆర్పీ, ఢిల్లీ మెట్రో అధికారుల సమన్వయంతో సీసీటీవీ నిఘా, బారికేడ్ల ఏర్పాటుతోపాటు, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ప్రకటనల ద్వారా తెలియజేయడం వంటి చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు. 

అదేవిధంగా, దక్షిణ మధ్య రైల్వే అమలు చేస్తున్న ‘పింక్‌ పెట్రోల్‌: ఐస్‌ ఇన్‌ ద స్కై, శక్తి ఆన్‌ ద గ్రౌండ్‌’కార్యక్రమాన్ని సదస్సులో ప్రస్తావించారు. మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో డ్రోన్ల నిఘా, వేగంగా స్పందించే బృందాలను సమన్వయం చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలను అరికట్టేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ, నిఘా పెంపు, నిందితులపై కఠిన చర్యలు, యువతలో అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 

మధ్య రైల్వేలోని పుణె డివిజన్‌ చేపడుతున్న ‘ప్రాజెక్ట్‌ దిశా’ద్వారా రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే పిల్లలకు విద్యా, వినోద కార్యక్రమాలతోపాటు రైల్వే భద్రతపై అవగాహన కల్పించడాన్ని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాలని అధికారులు సూచించారు. అంతేకాదు, ఆర్‌పీఎఫ్, జీఆర్పీ సంయుక్త శిక్షణ, విధ్వంసక చర్యల నివారణ, మాదకద్రవ్యాల గుర్తింపుపై తక్షణ సమాచార మార్పిడి, డిజిటల్‌ ఆధారాల నిర్వహణ వంటి వాటి అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement