నీటి వనరులకు రక్షణ కల్పించకుంటే ఊరుకోం | Supreme Court mandates ground-truthing and demarcation of wetlands | Sakshi
Sakshi News home page

నీటి వనరులకు రక్షణ కల్పించకుంటే ఊరుకోం

Oct 25 2026 6:24 AM | Updated on Oct 25 2026 6:44 AM

Supreme Court mandates ground-truthing and demarcation of wetlands

వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలంటూ రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: అత్యంత విలువైన నీటి వనరులను పరిరక్షించుకునే విషయంలో న్యాయస్థానాలు ఉదాసీనంగా ఉండలేవని సుప్రీంకోర్టు పేర్కొంది. నీటి వనరుల భౌతిక ధ్రువీకరణ, సరిహద్దుల గుర్తింపును తక్షణమే చేపట్టాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. పక్షి ప్రేమికుడు ఆనంద్‌ ఆర్య, న్యాయవాది ఎంకే బాలకృష్ణన్, వనశక్తి అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలిల ధర్మాసనం విచారించింది. తాగునీటికి వనరులు అత్యంత విలువైనవని, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు పరిధిలోకి ఇవి వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 

నీటి వనరుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను 9 ఏళ్ల క్రితమే ప్రచురించినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నీటి వనరులను పరిరక్షించుకోకపోవడం వల్ల కలుగుతున్న విపరిణామాలను చూస్తూ తాము మౌనంగా ఉండజాలమంది. నీటి వనరుల భౌతిక ధ్రువీకరణ, సరిహద్దుల గుర్తింపును వెంటనే చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ ప్రక్రియకు ఎక్కువ  సమయం పడుతుందని, కనీసం 6 నుంచి 9 నెలల సమయం ఇవ్వాలని సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నాఫడే కోరారు. ఈ పనిని పూర్తి చేసేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం కూడా అవసరమని పేర్కొన్న ధర్మాసనం..నాలుగు నెలల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement