
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అరుదైన పని చేశారు. ఉగ్రవాదంతో దెబ్బ తిన్న పహల్గాం పట్టణ పర్యాటకాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఏకంగా పహల్గాంలోనే మంగళవారం ప్రత్యేక కేబినెట్ భేటీ (Pahalgam Cabinet Meeting) నిర్వహించి దేశానికి బలమైన సందేశం పంపించారు.
అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఈ దాడి ప్రభావం జమ్ము కశ్మీర్ పర్యాటకంపై తీవ్రంగా పడింది.
ఘటన జరిగిన సాయంత్రం నుంచే పర్యాటకులు తిరుగు ముఖం పట్టడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తాకిడి మాత్రం పెద్దగా ఉండడం లేదు. దీంతో పర్యాటకాన్నే నమ్ముకున్న వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. పర్యాటకులను ఆహ్వానిస్తూ ఇవాళ ఆయన పహల్గాంలోనే కేబినెట్ భేటీ నిర్వహించారు. ‘‘ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వాళ్లను అభినందించడానికే ఈ సమావేశం. ప్రభుత్వంలో ఉన్నామని ఏదో మొక్కుబడిగా ఇక్కడికి మేం రాలేదు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలకు.. కశ్మీర్ పర్యాటకం, అభివృద్ధి రెండూ ఆగిపోవని చెప్పడానికే వచ్చాం’’ అని అన్నారాయన. అంతకు ముందు.. పహల్గాంలోని టూరిస్టు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఆ ఫొటోలు వైరల్‌కాగా.. వహ్ సీఎం సాబ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సారీ మేడమ్.. ఏదో ఏమోషన్‌లో అనేశా!